young woman call
Gulf Travel Agency: ఉన్నఊళ్లో సరియైన ఉపాధి దొరక్క.. ఉద్యోగాలు చేద్దామంటే స్థానికంగా ఆశించిన స్థాయిలో జీతాలు లేకపోవటంతో యువత గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ఉత్సకతను చూపుతుంటారు. ఇలాంటి వారికి మాయమాటలు చెప్పి గల్ఫ్ దేశాలకు పంపిస్తామంటూ ఏజెంట్లు దందాలకు పాల్పడుతున్నారు. డబ్బులు వసూళ్లు చేసి వారిని మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా.. గల్ప్ దేశాలకు పంపిస్తామంటూ ఓ యువతి ఏకంగా ఎమ్మెల్యేకే ఫోన్ చేసింది. పైగా ఎమ్మెల్యేతో గొడవకుసైతం దిగింది. ఈ విషయంపై పోలీసులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
గల్ఫ్ దేశాలకు పంపిస్తామంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ట్రావెల్స్ దందా గుట్టు రట్టయింది. గల్ఫ్ కు పంపిస్తామంటూ ఏకంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కే ఫోన్ చేయడంతో ఈ దందా బయటపడింది. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..
సారంగాపూర్ మండలం రంగపేట గ్రామనికి చెందిన నవీన్ ఓ యువతిని ఉద్యోగిగా పెట్టుకుని జిల్లా కేంద్రంలోని జంబిగద్దె ప్రాంతాల్లో అనుమతి లేకుండా లక్ష్మీ గల్ఫ్ ట్రావెల్స్ నిర్వహణ చేస్తున్నాడు. అయితే, యువతి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఫోన్ చేసి గల్ఫ్ పంపిస్తామని చెప్పింది. నాకెందుకు ఫోన్ చేశావని అడగడంతో ఎమ్మెల్యేపైనే యువతి ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read: ‘వాళ్లు తప్పు చేశారని చెబితే నా మీద కేసు పెడతారా?’.. యూట్యూబర్ అన్వేష్ కామెంట్స్
ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఎస్పీకి సమాచారం ఇచ్చారు. దీంతో రాత్రి ట్రావెల్స్ పై దాడిచేసిన పోలీసులు రికార్డులను పరిశీలించారు. సదరు ట్రావెల్స్ కు ఎలాంటి అనుమతి లేకపోవడంతో ట్రావెల్స్ నిర్వాహకుడు నవీన్ పై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
10టీవీతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ..
‘‘నియోజకవర్గంలో పర్యటన చేస్తున్న సందర్బంగా ఫోన్ వచ్చింది. గల్ఫ్ లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని లక్ష్మి ట్రావెల్స్ సంస్థ నుంచి మాట్లాడారు. గల్ఫ్ లో డ్రైవర్ ఉద్యోగం ఉందా అంటే ఉందని చెప్పారు. నేనెవరో తెలియకుండా నాకే గల్ఫ్ ఉద్యోగం అని చెప్పడంతో.. వెంటనే డీఎస్పీ కి కాల్ చేసి ఫిర్యాదు చేశాను. నాకు ఫోన్ చేసిన సంస్థకు ఎలాంటి చట్టబద్ధమైన లైసెన్స్ లేదు. యువత కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ పరంగా మేము కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. గల్ఫ్ సమస్యలపై ప్రభుత్వం అడ్వైజరీ కమిటీ వేసింది. ఆ కమిటీ కూడా ఈరోజు సీఎంతో భేటీ అయి పలు సూచనలు చేయనుంది’’ అని ఆది శ్రీనివాస్ అన్నారు.