తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది.. రాష్ట్రంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తాం: నితిన్ గడ్కరీ

తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది.. రాష్ట్రంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తాం: నితిన్ గడ్కరీ

Nitin GadKari

Updated On : May 5, 2025 / 12:43 PM IST

Nitin GadKari: తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా కొమురం భీం అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో రూ.3,900 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తోపాటు రాష్ట్ర మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో నితిన్ గడ్కరీ మాట్లాడారు. వ్యవసాయం, ఉపాధి, రవాణా, మౌలిక వసతులు దేశాభివృద్ధిని నిర్దేశిస్తాయని అన్నారు. రాష్ట్రాల మధ్య అనుసంధానం పెంచేందుకు కీలకమైన ప్రాజెక్టులను కేంద్రం చేపట్టిందని చెప్పారు.

 

రోడ్డు కనెక్టివిటీలో భాగంగా క్లిష్టమైన వంతెనలు, సొరంగ మార్గాలు నిర్మిస్తున్నామని, జోజిలా పాస్ టన్నెల్ వంటి క్లిష్టమైన నిర్మాణాలను చేపట్టామని అన్నారు. సూర్యాపేట నుంచి దేవరపల్లి వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారి, నాగ్ పూర్ నుంచి విజయవాడ కారిడార్ నిర్మాణం చేపట్టామని, తెలంగాణ – మహారాష్ట్ర మధ్య రోడ్డు కనెక్టవిటీ మరింత పెరగనుందని చెప్పారు. భద్రాచలం, బాసర, మేడారం వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామని గడ్కరీ తెలిపారు.

 

అదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉంది. భూమి కోసం, భుక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఆదివాసీల జిల్లా ఇది. అదిలాబాద్ జిల్లాకు ఎక్కువ సార్లు రావడానికి నేను ఇష్టపడతానని గడ్కరీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం సడక్ యోజన కింద దేశవ్యాప్తంగా రోడ్లు విస్తరిస్తోందని, రోడ్లు బాగున్న దేశాన్నే అభివృద్ధి చెందిన దేశంగా ప్రజలు భావిస్తారని అన్నారు. అమెరికా ధనిక దేశం కాబట్టి రోడ్లు బాగున్నాయనేది సరికాదు.. రోడ్లు బాగున్నందునే అమెరికాను ధనిక దేశంగా భావిస్తున్నామని అన్నారు.

 

తెలంగాణ పర్యటనలో భాగంగా నితిన్ గడ్కరీ సాయంత్రం 5.30 గంటలకు అంబర్ పేట ఫ్లై ఓవర్ ను ప్రారంభించనున్నారు. సాయంత్రం 6గంటలకు జీహెచ్ఎంసీ అంబర్ పేట స్టేడియంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అంబర్ పేట మున్సిపల్ గ్రౌండ్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొని ప్రసంగిస్తారు.