రైలు పట్టాలపై కారు నడుపుతూ యువతి హల్‌చల్.. అడ్డొచ్చిన వారికి కత్తితో బెదిరింపు.. గంటకుపైగా నిలిచిపోయిన రైళ్లు.. వీడియో వైరల్

నాగులపల్లి - శంకర్‌పల్లి మార్గంలో రైల్వే పట్టాలపై యువతి కారు నడుపుతూ హల్‌చల్ చేసింది. అడ్డుకొనేందుకు యత్నించిన వారిపై చాకుతో బెదిరింపులకు పాల్పడింది.

Young Woman Drives Car on Railway Track

Young Woman Drives Car on Railway Track : రీల్స్ మోజులో రైలు పట్టాలపై కారు నడుపుతూ ఓ యువతి హల్‌చల్ చేసింది. దీంతో గంటపాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని నాగులపల్లి-శంకర్‌పల్లి మార్గంలో చోటు చేసుకుంది.

 

నాగులపల్లి – శంకర్ పల్లి మార్గంలో పట్టాలపై యువతి కారు నడిపింది. దీనిని గమనించిన రైల్వే సిబ్బంది ఆపడానికి యత్నించగా.. ఆగకుండా వెళ్లిపోయింది. నాగులపల్లిలో స్థానికులు గమనించి కారును అడ్డగించే ప్రయత్నం చేశారు. అయినా ఆ యువతి కారును ఆపకుండా పోనిచ్చే ప్రయత్నం చేసింది. అతికష్టం మీద కారును అడ్డుకున్న స్థానికులకు చాకు చూపిస్తూ బెదిరించింది. ఇదే మార్గంలో వస్తున్న ఓ రైలు లోకో పైలట్ గమనించి ట్రైన్ ను ఆపారు. ఆ తరువాత స్థానికులు అతి కష్టం మీద ఆ యువతిని కారు నుంచి బయటకు లాగేశారు.

 

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతి నిర్వాకం కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న రైళ్లను అధికారులు నిలిపివేశారు. శంకర్‌పల్లి పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రీల్స్ కోసమే రైల్వే ట్రాప్‌పై యుతి కారు నడిపినట్లు తెలుస్తోంది.