YS Sharmila: వైఎస్ షర్మిల బాణం కాంగ్రెస్ చేతికి చిక్కిందా.. అందుకే సికింద్రాబాద్ సీట్‌పై కన్నేశారా?

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అడుగులు ఆసక్తికరంగా మారుతున్నాయి. పాలేరును కాదని సికింద్రాబాద్‌నే ఎంచుకోడానికి కూడా కొన్ని కారణాలు చెబుతున్నారు షర్మిల అనుచరులు.

YS Sharmila seek Secunderabad as alternative for Paleru

YS Sharmila – Secunderabad : షర్మిల బాణం మరోసారి రూటు మారనుందా? పాలేరు (Paleru)లో పోటీ చేస్తానన్న వైఎస్ఆర్టీపీ (YSRTP) అధ్యక్షురాలు షర్మిల.. ఇప్పుడు సికింద్రాబాద్ వైపు చూస్తున్నారా?క్రిస్టియన్ ఓట్లే షర్మిలను లష్కర్ వైపు లాగుతున్నాయా? కాంగ్రెస్‌తో వైఎస్ఆర్టీపీ పొత్తుకే పరిమితం అవుతుందా.. విలీనం కానుందా.. షర్మిల ఏ పార్టీ సింబల్ పై పోటీ చేయబోతున్నారు? రాజన్న బాణం ఎటువైపు గురి పెట్టింది.. తెరవెనుక రాజకీయమేంటి?

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అడుగులు ఆసక్తికరంగా మారుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి (YS Rajasekhara Reddy) ఆశయాలను సాధిస్తానని పార్టీని ప్రారంభించి వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన షర్మిల.. కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ (dk shivakumar) తో రెండు సార్లు భేటీ కావడం.. ఆ తర్వాత రాహుల్, ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) లతో షర్మిల టచ్ లో ఉన్నారని ప్రచారం జరగడంతో వచ్చే ఎన్నికల్లో ఆమె హస్తం పార్టీతో పొత్తు పెట్టుకుంటారని కొంతమంది ప్రచారం చేశారు. అదే సమయంలో పొత్తు కాదు విలీనమే అంటూ మరో ప్రచారం జరిగింది.

ఐతే కొద్దిరోజులుగా ఈ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడినా.. షర్మిల, కాంగ్రెస్ మధ్య రిలేషన్ స్ట్రాంగ్ గా ఉందనేది మాత్రం పబ్లిక్ టాక్. ఇందుకు సంబంధించి ఇటీవల జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ల్లో కొందరికి టిక్కెట్లు ఇవ్వనని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేయడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి స్పందించారు. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే గత ఎన్నికల్లో వలే వచ్చే ఎన్నికల్లో కూడా సిట్టింగ్‌లు అందరికీ సీట్లు ఇవ్వాలని సవాల్ విసిరారు. రేవంత్‌కు మద్దతుగా షర్మిల కూడా అందే డిమాండ్ తో ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి షర్మిల చేరికను మొదటి నుంచీ రేవంత్ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అసలు షర్మిలకు తెలంగాణా రాజకీయాలతో సంబంధమే లేదంటూ పలుమార్లు ఆన్ రికార్డ్ కూడా రేవంత్ తేల్చిచెప్పారు.

Also Read: బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మైండ్‌గేమ్‌.. తెరవెనుక రాజకీయంలో మూడూ మూడే!

వైఎస్ఆర్టీసీని స్థాపించిన తర్వాత తాను ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు షర్మిల. తన పాదయాత్రను కూడా ఆ జిల్లా నుంచే ప్రారంభించారు. అంతేకాకుండా పాలేరులో ప్రత్యేకంగా కార్యాలయాన్ని ప్రారంభించారు. తన తండ్రి అభిమానులు ఎక్కువగా ఉండటం.. ఆంధ్రా ప్రాంతానికి పాలేరు దగ్గరగా ఉండటంతో అనుకూలంగా ఉంటుందని భావించారు షర్మిల. అయితే వైఎస్ఆర్టీపీ-కాంగ్రెస్ మధ్య స్నేహ సంబంధాలు మొగ్గ తొడిగిన తర్వాత షర్మిల పోటీపై పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్తో పొత్తు కుదిరినా.. విలీనం జరిగినా.. తానెక్కడ పోటీ చేయాలో హస్తం పార్టీయే డిసైడ్ చేయనుండటంతో పాలేరుపై షర్మిల ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారని అంటున్నారు. అందుకే ప్రత్యామ్నాయంగా సికింద్రాబాద్ సీట్‌పై షర్మిల కన్నేశారని చెబుతున్నారు.

Also Read: సంజయ్‌కి అస్సలు మింగుడు పడటం లేదట.. గెలిచే చాన్స్ లేదని చెప్పకనే చెప్పేశారా?

పాలేరును కాదని సికింద్రాబాద్‌నే ఎంచుకోడానికి కూడా కొన్ని కారణాలు చెబుతున్నారు షర్మిల అనుచరులు. సికింద్రాబాద్‌లో ఎక్కువగా క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు ఉన్నాయని.. గతంలో సినీనటి జయసుధ, మేరీ రవీంద్రనాథ్ లాంటి వారు క్రిస్టియన్ ఓట్ల సహకారంతో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఇక్కడి నుండి గెలిచారు. షర్మిల కూడ క్రిస్టియన్ కావడం వల్ల.. సికింద్రాబాద్ నుంచే పోటీ చేయడమే శ్రేయస్కరమని భావిస్తున్నారని అంటున్నారు. ఏదైనా కాంగ్రెస్తో చర్చలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే షర్మిల ఏం చేయాలో.. ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది తేలుతుందని అంటున్నారు. ఒకప్పుడు ఏపీ సీఎం జగనన్న బాణంగా చెప్పుకున్న షర్మిల.. తెలంగాణ రాజకీయాల్లో రాజన్న బాణంగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు రేవంత్‌కు మద్దతుగా ట్వీట్ చేయడం.. కాంగ్రెస్‌తో చర్చలకు రెడీ అవతుండటంతో షర్మిల బాణం కాంగ్రెస్ చేతికి చిక్కిందా? అంటున్నారు పరిశీలకులు.

ట్రెండింగ్ వార్తలు