Anita Anand: కెనడా ప్రధాని పదవి రేసులో భారత సంతతి నాయకురాలు.. ఎవరీ అనితా ఆనంద్?

ఆనంద్ రాజకీయ రంగ ప్రవేశం 2019లో జరిగింది. ఆ ఏడాది ఓక్‌విల్లే నుంచి ఆమె పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు.

Anita Anand: కెనడా ప్రధాని పదవి రేసులో భారత సంతతి నాయకురాలు.. ఎవరీ అనితా ఆనంద్?

Anita Anand Might Replace Justin Trudeau

Updated On : January 8, 2025 / 12:34 PM IST

కెనడా ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించిన విషయం తెలిసిందే. లిబరల్ పార్టీ ఆఫ్ కెనడాకు తదుపరి నాయకుడిని ఎన్నుకున్న అనంతరం పార్టీ నేత పదవితో పాటు ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. దీంతో తదుపరి ప్రధాని రేసులో కొందరి పేర్లు వినపడుతున్నాయి.

వారిలో భారత సంతతికి చెందిన నాయకురాలు అనితా ఆనంద్ ఒకరు. ఆమె కెనడా కొత్త ప్రధాని అయ్యే అవకాశం ఉంది. అనితా ఆనంద్‌తో పాటు డొమినిక్ లెబ్లాంక్, క్రిస్టియా ఫ్రీలాండ్, మెలనీ జోలీ, ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపైన్, మార్క్ కార్నీ కూడా ఈ పదవికి పోటీ పడుతున్నారు.

అనితా ఆనందర్ ప్రస్తుతం రవాణా, అంతర్గత వాణిజ్య మంత్రిగా పనిచేస్తున్నారు. గత ఐదేళ్లలో ఆమె పలు కీలక పదవుల్లో కొనసాగారు. లిబరల్ పార్టీ సీనియర్ సభ్యురాలైన అనితా ఆనంద్ 2019 నుంచి పార్లమెంటు సభ్యురాలిగా, పబ్లిక్ సర్వీసెస్, ప్రొక్యూర్‌మెంట్ మంత్రి, జాతీయ రక్షణ మంత్రి, ట్రెజరీ బోర్డ్ ప్రెసిడెంట్‌ సహా అనేక ఉన్నత పదవుల్లో బాధ్యతలు నిర్వహించారు. ఆమె 2024 నుంచి రవాణా శాఖ మంత్రిగా ఉంటున్నారు.

కుటుంబం నేపథ్యం.. చదువు.. 
అనితా ఆనందర్ 1967, మే 20న నోవా స్కోటియాలోని కెంట్‌విల్లేలో జన్మించారు. ఆమె తల్లిదండ్రుల పేర్లు సరోజ్ డి.రామ్, ఎస్వీ ఆనంద్‌. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులే. వారు 1960 దశకం ప్రారంభంలో భారతదేశం నుంచి కెనడాకు వలస వెళ్లారు. అనితా ఆనంద్‌కు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.

వారి పేర్లు గీత, సోనియా. 1985లో 18 సంవత్సరాల వయస్సులో అనితా ఆనంద్ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (ఆనర్స్) పూర్తి చేశారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి అంటారియోకు వెళ్లారు. తరువాత ఆమె డల్హౌసీ విశ్వవిద్యాలయం, టొరంటో విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీ చదివారు. రాజకీయాల్లోకి ప్రవేశించేముందు అనితా ఆనంద్.. యేల్ లా స్కూల్, టొరంటో విశ్వవిద్యాలయం వంటి వాటిలో లెక్చరర్‌గా పనిచేశారు.

2019లో రాజకీయ రంగ ప్రవేశం
ఆనంద్ రాజకీయ రంగ ప్రవేశం 2019లో జరిగింది. ఆ ఏడాది ఓక్‌విల్లే నుంచి ఆమె పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. కరోనా విజృంభణ సమయంలో పబ్లిక్ సర్వీసెస్, ప్రొక్యూర్‌మెంట్ మంత్రిగా ఆమె చేసిన కృషికి గుర్తింపు లభించింది. 2021లో ఆమె జాతీయ రక్షణ మంత్రిగా నియమితులయ్యారు.

ఆ తర్వాత ట్రెజరీ బోర్డు అధ్యక్షురాలిగా, కెనడా ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించేందుకు ఆమె పనిచేశారు.
ఆమె 2024లో రవాణా మంత్రి అయినప్పటి నుంచి ఆమె కెనడా మౌలిక సదుపాయాలను ఆధునికీకరించడం, రోడ్లు, హైవేలు, రైల్వేలను మెరుగుపరచడం, వాతావరణ మార్పు, రవాణా రంగంలో భద్రతా సంస్కరణలకు ప్రాధాన్యం ఇవ్వడంపై దృష్టి పెట్టి పనిచేశారు. ఇప్పుడు ఆమె ట్రూడో స్థానంలో ప్రధాన మంత్రి పదవికి పోటీ పడుతున్నారు.

Anand Mahindra: ఒకే ఒక్క ఫొటో పోస్ట్ చేసి.. అందరినీ ఆలోచింపజేసిన ఆనంద్ మహీంద్ర