why telangana governor tamilsai reject government proposed MLCs
Telangana Governor: తెలంగాణలో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య దూరం ఏ మాత్రం తగ్గలేదని మరోసారి బయటపడింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో ప్రభుత్వ సిఫార్సులను తిరస్కరించిన గవర్నర్ తమిళిసై.. ప్రభుత్వంతో రాజీపడే ప్రసక్తే లేదన్న సంకేతాలు పంపారు. బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఏదో రహస్య అజెండా ఉందన్న ప్రచారం ఓ వైపు జరుగుతుండగా.. గవర్నర్ నిర్ణయం ఆ ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టినట్టైంది. నిజంగా నిబంధనల ప్రకారమే గవర్నర్ ప్రభుత్వ సిఫార్సులను తిరస్కరించారా? లేక ఇందులో ఇంకేమైనా మతలబు ఉందా?
తన అధికారాలపై తగ్గేదేలే అంటున్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై.. రాష్ట్ర ప్రభుత్వంతో సై అంటే సై అన్నట్లు వ్యవహరిస్తున్న గవర్నర్.. తాజాగా మరోసారి గవర్నమెంట్‌తో రాజకీయ యుద్ధానికి తెరలేపారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఇద్దరు బీఆర్‌ఎస్ నేతల పేర్లను సిఫార్సు చేస్తూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తిరస్కరించడం ద్వారా ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చారు గవర్నర్. సుమారు రెండు నెలలుగా పెండింగ్‌లో పెట్టిన ఫైల్‌పై ప్రభుత్వ వివరణ కోరకుండా.. తిరస్కరణకే మొగ్గుచూపడం పరిశీలిస్తే గవర్నర్ ఉద్దేశమేమిటో స్పష్టమవుతోంది. బీఆర్‌ఎస్ గవర్నమెంట్‌తో జరుగుతున్న రాజకీయ యుద్ధంలో రాజీ కన్నా రగడకే ప్రాధాన్యమిచ్చేలా గవర్నర్ వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి నిబంధనల ప్రకారమే గవర్నర్ ఎమ్మెల్సీ ఫైల్‌ను తిరస్కరించినప్పటికీ.. గత అనుభవాల దృష్ట్యా.. ఈ నిర్ణయం వెనుక రాజకీయ ఉద్దేశమేమైనా ఉందే అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు.
తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై ఈ మధ్యనే నాలుగేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఐతే ఆమె గవర్నర్‌గా వచ్చిన కొత్తలోనే ప్రభుత్వంతో కాస్త సఖ్యతతో వ్యవహరించేవారు. కానీ, తర్వాత తర్వాత ప్రభుత్వంతో గవర్నర్‌కు దూరం పెరుగుతూ వచ్చింది. ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి నియామకంపై మొదలైన గొడవ చిలికిచిలికి గాలివానలా మారి ఎప్పటికప్పుడు దుమారం రేపుతోంది. అంతేకాదు దేశంలో మరెక్కడా లేనట్లు గవర్నర్‌పై న్యాయస్థానాల్లో కేసులు వేసేంతవరకు వెళ్లింది. కోర్టు సూచనతో రెండు వ్యవస్థల మధ్య రాజీ కుదిరినా.. ప్రభుత్వ నిర్ణయాలకు చెక్ చెప్పేలా ఎప్పటికప్పుడు గవర్నర్ అడ్డుచక్రం వేస్తుండటం రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య సమస్యగా మారింది.
Also Read: చంద్రబాబు అరెస్టుపై స్పందించిన కేటీఆర్.. మాకేం సంబంధం.. హైదరాబాద్ లో ర్యాలీలు ఎందుకు?
రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నా.. ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు గవర్నర్ ఆమోద ముద్ర వేయాలి. గవర్నర్ ఆమోదం లేనిదే ఏ బిల్లు చట్టం కాదు.. ఈ అధికారాన్ని అడ్డంపెట్టుకునే కేసీఆర్ సర్కార్‌ను ముప్పతిప్పలు పెడుతున్నారు గవర్నర్. పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో నియమించేందుకు ససేమిరా అనడంతో చేసేది లేక ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ చేసింది ప్రభుత్వం. అప్పట్లో ప్రభుత్వానికి సమయం ఉండటంతో ఆ విషయంలో తెగేదాక లాగలేదు గులాబీ బాస్ కేసీఆర్. కానీ గవర్నర్‌తో ప్రత్యక్ష యుద్ధానికి అదే ప్రధాన కారణంగా మారిపోయింది. ఇక ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బిల్లులపై కొర్రీలు వేయడం గవర్నర్ పనిగా చేసుకుంటే.. గవర్నర్ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి, మంత్రులు దూరంగా ఉండటం ప్రభుత్వ విధానంగా మారింది. తనకు ప్రొటాకాల్ ఇవ్వడం లేదని గవర్నర్ ఆగ్రహం చెందడమే కాకుండా.. సచివాలయం, అంబేద్కర్ విగ్రహాం ఆవిష్కరణ వంటి ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం పంపడంలేదని రాష్ట్ర ప్రభుత్వంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు గవర్నర్.. ఈ విధంగా ఇటు కార్యనిర్వాహక వ్యవస్థ అయిన ప్రభుత్వం.. అటు రాజ్యాంగ వ్యవస్థ అయిన గవర్నర్ మధ్య పంతాలు పట్టింపులతో తెలంగాణ రాజకీయం నిత్యం వాడివేడిగా మారింది.
Also Read: గవర్నర్ నిర్ణయంపై స్పందించిన బండి సంజయ్.. బీఆర్ఎస్ నేతలపై ఆసక్తికర వ్యాఖ్యలు
గత నెలలో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై ఒకే వేదికపై కనిపించారు. బడ్జెట్ సమావేశాల్లో హైకోర్టు సూచనలతో ప్రభుత్వం, గవర్నర్ ఒక్కోమెట్టు దిగిరావడంతో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందింది. తద్వారా రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా వివాదం సర్దుమణిగింది. కానీ, ఇప్పుడు ఇద్దరు బీఆర్‌ఎస్ నేతలను ఎమ్మెల్సీగా నియమించడంపై గవర్నర్ కొర్రీ వేయడం పొలిటికల్ సర్కిల్స్‌లో విస్తృత చర్చకు దారితీస్తోంది. దానికి కారణం కౌశిక్‌రెడ్డి విషయంలో ప్రభుత్వం ముందు మరో ఆప్షన్ ఉండేది. గవర్నర్ కోటాలో కాకపోతే.. ఎమ్మెల్యే కోటాలోనో.. స్థానిక సంస్థల కోటాలోనో నియమించుకోవచ్చనే ధీమా ప్రదర్శించింది ప్రభుత్వం. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఎందుకంటే బీఆర్‌ఎస్ ప్రభుత్వం మరో మూడు నెలల్లో ఎన్నికలను ఎదుర్కోవాల్సివుంది.
Also Read: తెలంగాణ కాంగ్రెస్‌లో ఊపందుకున్న బీసీ నినాదం.. 40 సీట్లు ఇస్తారా?
ఫలితాలు ఎలా వచ్చినా.. ఎన్నికల్లోగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకాలు పూర్తయితే.. ఇద్దరు నేతలకు పదవులు కట్టబెట్టొచ్చు. కానీ, ఎన్నికలైనంత వరకు గవర్నర్ కోటాలో నియామకాలు పూర్తిచేయకపోతే.. ఈ అవకాశాన్ని వచ్చే ప్రభుత్వమే వినియోగించుకునే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే ఈ నియామకాలు పూర్తి చేసుకోవడం బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకం.. అందుకే గవర్నర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్‌లో ఏ ఒక్క నేతా జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ నియమించిన రాజ్యసభ సభ్యులు, యూపీ ప్రభుత్వం నియమించిన ఎమ్మెల్సీల వివరాలను ప్రజల ముందు పెట్టి గవర్నర్ బీజేపీ అజెండాతో పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ ఎపిసోడ్‌లో బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఓ రాజకీయ అస్త్రం దొరికనట్లైంది. బీజేపీ బీ టీమ్‌గా తమను విమర్శిస్తున్న ప్రత్యర్థులపై ఎదురుదాడికి గవర్నర్ అంశాన్నే వాడుకుంటోంది బీఆర్ఎస్. అంతేకాదు షెడ్యూల్ విడుదలలోగా ఎమ్మెల్సీలపై గవర్నర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే.. బీజేపీపై దాడికి ఇది కూడా ఓ అస్త్రంగా వాడుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికి గవర్నర్ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.