Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో ఊపందుకున్న బీసీ నినాదం.. 40 సీట్లు ఇస్తారా?

ఇప్పటికే బీసీ నేతలు బలంగా పని చేసుకుంటున్న 40 నియోజకవర్గాల జాబితాను తయారు చేశారు. ఈ సీట్లు చేజారిపోకుండా ముందే జాగ్రత్త పడుతున్న బీసీ నేతలు ఢిల్లీకి పయనమయ్యారు.

Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో ఊపందుకున్న బీసీ నినాదం.. 40 సీట్లు ఇస్తారా?

telangana congress BC leaders ask assembly 40 seats

Telangana Congress BC Leaders: తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు స్వరం పెంచుతున్నారు. ఈ సారి తమ కోటా సీట్లు పెంచాలని గట్టి పట్టుదల ప్రదర్శిస్తున్నారు. వరుస సమావేశాలు నిర్వహిస్తూ హైకమాండ్‌కు అల్టిమేటం జారీ చేస్తున్నారు. మొత్తం 40 సీట్లు కేటాయించాలని కోరుతున్న కాంగ్రెస్ బీసీ నేతలు ఏకంగా అధిష్టానంతో (Congress High Command) తాడోపేడో తేల్చుకోవాలని ఢిల్లీకి బయలుదేరారు. ఎన్నడూ లేనట్లు కాంగ్రెస్ బీసీ లీడర్లు స్వరం పెంచటానికి కారణమేంటి? కాంగ్రెస్ ఏం చేయనుంది? తెరవెనుక రాజకీయమేంటో చూద్దాం.

కాంగ్రెస్‌లో బీసీ నినాదం ఊపందుకుంది. రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ జనాభాకు తగ్గట్టే అసెంబ్లీ టికెట్లు కేటాయించాలని బీసీ నాయకులు పట్టుబడుతున్నారు. ప్రతిసారి గెలుపు గుర్రాల పేరుతో బీసీ నేతలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి ఎన్నికల ముందే మేల్కొన్నారు కాంగ్రెస్ బీసీ నాయకులు. బీసీ జనాభా ఎక్కువగా ఉన్న.. బీసీ నేతలు పని చేసుకుంటున్న నియోజకవర్గాలను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదే అంశంపై గాంధీభవన్ వేదికగా ఇప్పటికే ఓ సారి సమావేశమైన బీసీ నేతలు.. తాజాగా ఢిల్లీయాత్రకు సిద్ధమయ్యారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలోనూ ఇదే విషయమై చర్చించి ప్రతి పార్లమెంట్ పరిధిలో రెండు సీట్లు కేటాయించాలని ఒత్తిడి చేశారు. ఇప్పటికే బీసీ నేతలు బలంగా పని చేసుకుంటున్న 40 నియోజకవర్గాల జాబితాను తయారు చేశారు. ముఖ్యంగా జనగామ నియోజకవర్గంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను కాదని.. కొమ్మూరి ప్రతాపరెడ్డికి టికెట్ ఇవ్వాలని ఆలోచన చేస్తోంది కాంగ్రెస్. హుస్నాబాద్‌పై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, (Ponnam Prabhakar) ఎల్బీనగర్ సీటుపై మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, నల్గొండ అసెంబ్లీ సీటుపై చెరుకు సుధాకర్ (Cheruku Sudhakar) వంటి నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ సీట్లు చేజారిపోకుండా ముందే జాగ్రత్త పడుతున్న బీసీ నేతలు ఢిల్లీకి పయనమయ్యారు.

Also Read: వ్యూహాల‌కు ప‌దునుపెడుతోన్న కాంగ్రెస్.. బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీకి వల!

కాంగ్రెస్‌లో సామజిక న్యాయం పాటించాలని కోరుతూ ఏఐసీసీ పెద్దలను కలవాలని డిసైడ్ అయ్యారు బీసీ నేతలు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీని కలిసి తమ డిమాండ్‌ను హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. బుధవారం ఢిల్లీలో ముఖ్యనేతలను కలవనున్న కాంగ్రెస్ బీసీ నేతలు తమ డిమాండ్‌ను సాధిస్తారా? లేదా? అన్నదే ఉత్కంఠగా మారింది.

Also Read: రేవంత్‌రెడ్డికి బ‌లం పెరిగిందా.. స్క్రీనింగ్ కమిటీలో చోటు చేసుకున్న ప‌రిణామాలేంటి?