పేదల కోసం..రూ.5వేల కోట్లు అప్పు అడుగుతున్న ఆంధ్ర

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం HUDCO నుంచి రూ.5వేల కోట్లు అప్పు తీసుకోవాలనుకుంటుంది. హౌజింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి అప్పు తీసుకుని పేదల కోసం 12వేల ఎకరాల స్థలాలను కొనుగోలు చేయాలనేదే ప్లాన్. రాష్ట్రంలో స్థలాలు లేకుండా ఉన్న నిరుపేదలకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మార్చి 25 తెలుగు సంవత్సరాది ఉగాది రోజున 25లక్షల బెనిఫిషియర్లకు ఇళ్ల స్థలాలను ప్రకటించనుంది రాష్ట్ర ప్రభుత్వం. పేదలందరికీ స్థలాలను పంపిణీ చేయాలంటే దాదాపు 40వేల ఎకరాల స్థలం అవసరం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 27వేల ఎకరాలు అందుబాటులో ఉండగా మరో 15వేల ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకోవాల్సి ఉంది.
జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పరిశ్రమల కోసం వదిలేసిన స్థలాలను కూడా ఇళ్ల కోసం కేటాయించేశారు. ఐదేళ్లుగా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ లేకపోవడమే దీనికి కారణం. ‘మేము ఓ 12ఎకరాల స్థలాన్ని రైతుల నుంచి, భూస్వాముల నుంచి కొనుగోలు చేయాలనుకుంటున్నాం. మిగిలిన 3వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా తీసుకోవాలనుకుంటున్నాం. ఈ కొనుగోలుకు దాదాపు రూ5వేల కోట్ల ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని కోసమే హడ్కోను అడగ్గా అప్పు ఇచ్చేందుకు ఒప్పుకుంది’ అని ఓ రెవెన్యూ అధికారి చెప్పారు.
ముందుగా 19వేల ఎకరాలు కావాలని.. దాని కోసం రూ.10వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. దీని గురించి ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌ను కూడా సంప్రదించింది రాష్ట్ర ప్రభుత్వం. హడ్కో ముందుకు రావడంతో ఏపీకి రుణ భారం కాస్త తగ్గినట్లు అయిందని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే ప్రతిపక్ష పార్టీ టీడీపీ హిందూ మతానికి సంబంధించిన భూములను ఈ పథకం కింద పంచి బెడుతున్నట్లు ఆరోపిస్తుంది.