జగన్ కేసుల కోసం ప్రజలు ఓట్లు వేయాలా..విశాఖ సభలో సీఎం

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని,విభజన హామీలు నెరవేరుస్తామని,అమరావతి అభివృద్ధి చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2014 ఎన్నికల ప్రచార సమయంలో తిరుపతి వెంకన్న సాక్షిగా అనేక మాటలు చెప్పి నమ్మకద్రోహం చేశారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.
విశాఖలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ,ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య అతిథులుగా ఆదివారం(మార్చి-31,2019)టీడీపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ…ఐదేళ్ల క్రితం మోడీ ఏం చెప్పారో… ఏం చేశారో చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. రాజధానికి సహకరించకుండా నమ్మకద్రోహం చేసిన వ్యక్తి మోడీ అని అన్నారు. హుద్ హుద్ సమయంలో సాయంగా మొదటివిడతగా రూ.1000కోట్లు ఇస్తామని మోడీ హామీ ఇచ్చి రూ.650కోట్లు మాత్రమే ఇచ్చి రూ. 350 కోట్లు ఎగ్గొట్టారని చంద్రబాబు ఆరోపించారు.అహ్మదాబాద్ కంటే విశాఖ ముందుకు వెళ్తుందని మోడీకి భయమన్నారు.
ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి మోడీ అడ్డంకులు సృష్టించారని, డివిజన్ లేకుండా విశాఖ రైల్వే జోన్ ఇచ్చారని విమర్శించారు. ప్రధానికి ఉండాల్సిన అర్హతలు మోడీకి లేవని అన్నారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ. 350 కోట్లను వెనక్కి తీసుకున్నారని, మోడీది నీచమైన మనస్థత్వం అని చంద్రబాబు విమర్శించారు.మోడీకి ఏపీ గడ్డపై కాలుపెట్టి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.ఏపీలో ఒక్కరు కూడా మోడీకి ఓటు వేయడానికి సిద్ధంగా లేరన్నారు.మోడీ ఓడిపోతేనే దేశం బాగుపడుతుందని, దేశంలో ఏ వర్గం సంతోషంగా లేదని అన్నారు. మోడీకి నీతిలేదని, పద్ధతి లేదని చంద్రబాబు విమర్శించారు.ప్రధాని స్థాయికి తగని విధంగా మోడీ విమర్శలు చేస్తున్నారని అన్నారు.
55లక్షలమందికి ఏపీలో ఫించన్ ను రూ.200నుంచి రూ.2000చేసిన ఘనత టీడీపీదేనని చంద్రబాబు అన్నారు.మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తే ఫించన్ ను రూ.3,000లకు పెంచుతామని తెలిపారు.చంద్రబాబే మళ్లీ గెలవాలని వృద్ధులు అనుకుంటున్నారని అన్నారు.సింహాచలం భూముల విషయంలో ప్రతిపక్ష వైసీపీ అనవసర రాద్దాంతం చేస్తుందని..వైసీపీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు.వైసీపీ పేదవాళ్లను దోచుకొనే పార్టీ అని,సంక్షేమం గురించి సరైన హామీలివ్వలేక ఒక్క అవకాశం.. ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారన్నారు. ఆ ఒక్క అవకాశం ఇస్తే వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని ముంచేస్తారని అన్నారు.
జగన్ కేసుల కోసం ప్రజలంతా ఓట్లు వేయాలా..ఆయన జైలుకు వెళ్లకుండా మనం కాపాడాలా అని సీఎం ప్రశ్నించారు.టీడీపీ నీతివంతమైన పాలన అందించిందన్నారు.జగన్ పై 31 కేసులు ఉన్నాయన్నారు.జగన్ అసెంబ్లీకి 24రోజుల మాత్రమే వచ్చాడని..కోర్టుకి 240రోజులు వెళ్లాడని అన్నారు.కోడికత్తి పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయా అని ప్రశ్నించారు.గత ఎన్నికల్లో విశాఖలో వైఎస్ విజయమ్మ పోటీ చేశారని మళ్లీ ఎందుకు పోటీ చేయడం లేదని తాను అడుగుతున్నానని,దీనికి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.