తిరుమల కొండపై మందుకొట్టి.. మహిళను కొట్టిన వ్యాపారి

తిరుమల కొండపై దారుణం. గోవింద నామ స్మరణలతో ప్రశాంతంగా ఉండాల్సిన ప్రాంతంలో.. ఓ వ్యక్తి చేసిన పని కలకలం రేపుతోంది. ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోంది. ఓ వ్యాపారి మందు కొట్టి రోడ్లపై బీభత్సం చేశాడు. బూతుల తిడుతూ.. ఓ మహిళను తీవ్రంగా కొట్టాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియని విధంగా ప్రవర్తించాడు. జుట్టుపట్టుకుని ఈడ్చేస్తూ.. అత్యంత కిరాతకంగా వ్యవహరించాడు అతను. భద్రతా అధికారులు కూడా అతడిని పట్టించుకోలేదు. భక్తులు అడ్డుకున్నా ఫలితం లేదు. తమపై ఎక్కడ దాడి చేస్తాడో అనే భయంతో భక్తులు భయపడ్డారు. అధికారులు సైతం పట్టించుకోకపోవటంతో.. మిగతా వారు కూడా ఎవరికి వారు చూస్తూ ఉండిపోయారు. అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు.
తిరుమలలో అనధికార వ్యాపారుల ఆగడాలు శృతి మించిపోతున్నాయి అనటానికి ఇదో ఎగ్జాంపుల్. కొందరు వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కొండపై మద్యం నిషేధం. అలాంటిది ఓ వ్యాపారి మందుకొట్టి రోడ్లపై ఈ విధంగా ప్రవర్తిస్తుంటే విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు అనే ప్రశ్న భక్తుల నుంచి వస్తోంది. బాధితురాలు సైతం భయపడి పోలీస్ ఫిర్యాదు చేయకపోవటం విశేషం. ఇలాంటి ఘటనలు తిరుమల కొండపై తరచూ జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవటంలేదనే విమర్శలు ఉన్నాయి.