జగనన్న విద్యాదీవెన: మహేష్ బాబు డిగ్రీ చదువుతున్నాడట!

  • Published By: vamsi ,Published On : February 26, 2020 / 09:28 AM IST
జగనన్న విద్యాదీవెన: మహేష్ బాబు డిగ్రీ చదువుతున్నాడట!

Updated On : February 26, 2020 / 9:28 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు డిగ్రీ చదువుతున్నాడట. అదేంటి? మహేష్ బాబు ఇప్పుడు చదవడం ఏంటీ? అనుకుంటున్నారా? ఇటీవల మహర్షి సినిమాలో స్టూడెంట్‌గా చేసినట్లే ఇప్పుడు మరోసారి సినిమాలో స్టూడెంట్ రోల్ చేస్తున్నాడా? అని అనుకుంటున్నారా? కాదండోయ్.. కర్నూలు జిల్లాలో మహేష్ బాబు నిజంగానే డిగ్రీ చదువుతున్నారట. అంతేకాదు.. ఆయనకు జగన్ అన్న విద్యా దీవెన పథకం కింద కార్డు కూడా వచ్చేసింది. అది కూడా ఒకసారి కాదు రెండుసార్లు. 

వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకుని వచ్చిన విద్యా దీవెన పథకం గురించి తెలుసు కదా? విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు.. డిగ్రీ చదివే అర్హులైన విద్యార్థులకు ఈ పథకం కింద కార్డులను కూడా పంపిణీ చేశారు. ఈ పథకంలో భాగంగానే కర్నూలు జిల్లాలో జగనన్న విద్యా దీవెన కార్డులో మహేష్ బాబు ఫోటో ప్రత్యక్షం అయ్యింది.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సిద్దార్థ డిగ్రీ కళాశాలలో లక్ష్మీ అనే విద్యార్థిని ఫోటోకు బదులుగా మహేష్ బాబు ఫొటో అందులో కనిపించింది. ఆ కార్డు చూసిన విద్యార్థిని షాకైంది. వెంటనే విషయాన్ని సచివాలయ ఉద్యోగులకు దృష్టికి తీసుకెళ్లింది. మరోచోట లోకేష్ గౌడ్ అనే విద్యార్ధి కార్డులో విద్యార్ధి ఫోటోలకు బదులుగా మహేష్ బాబు ఫోటో వచ్చింది. ఒక కార్డులో మహర్షి సినిమాలోని మహేష్ బాబు ఫోటో రాగా.. ఇంకో కార్డులో వేరే సినిమాలోని ఫోటో వచ్చింది.

జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ సహా వసతి, భోజన ఖర్చుల కింద ప్రభుత్వం ఏడాదికి రూ.20 వేలు ఇస్తోంది. ఈ పథకంకు సంబంధించిన కీలకమైన కార్డులో ఇటువంటి తప్పులు దొర్లడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

Read More>>‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్!