జేసీ దివాకర్ రెడ్డిపై చర్యలకు సిద్ధమైన ఈసీ

మామూలు టైంలో నోరు జారితే ఫలితం ఎలా ఉంటుందో కానీ… ఎన్నికల వేళ మాత్రం తేడా ఖచ్చితంగా వస్తుంది. ఏకంగా నోటీసులు, విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. TDP MP జేసీ దివాకర్‌రెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది. ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చిందంటూ ఆయన చేసిన కామెంట్స్‌పై EC ఆగ్రహం వ్యక్తం చేసింది. కోడ్ ఉల్లంఘించినందున చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించింది.
ఏపీలో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 11వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించి పోలింగ్ సరళిపై ఆరా తీశారు. ఈ సమయంలో జేసీ దివాకర్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఖర్చుకు సంబంధించి వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఏపీలో నేతలు, పార్టీలు పది వేల కోట్లు ఖర్చు చేశారంటూ జేసీ లెక్కలు చెప్పిన సంగతి తెలిసిందే. పైగా..తన నియోజకవర్గంలోనే సుమారు రూ. 50 కోట్ల వరకూ ఖర్చయిందని చెప్పుకొచ్చారు. కూలి చేసుకునేవాడు కూడా ఓటుకి రూ. 5 వేలు అడిగారని వ్యాఖ్యానించారు.
అంతేకాదు తన కుమారులు జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ పవన్ కుమార్ రెడ్డి ఎన్నికకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. జేసీ కామెంట్స్‌పై వైసీపీ, సీపీఐ నేతలు ఫైర్ అయ్యారు. వెంటనే ఎలక్షన్ కమిషన్‌కు కంప్లైంట్ చేశారు. ఫిర్యాదును స్వీకరించిన ఈసీ.. జేసీ చేసిన కామెంట్స్‌పై విచారణ జరిపింది. జేసీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని నిర్ధారించింది. దీంతో అతడిపై చర్యలకు ఆదేశించింది. చర్యలు తీసుకోవాలంటూ అనంతపురం జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది.