ప్రమాదానికి గురైన బోటు యజమాని, మరో ఇద్దరు అరెస్ట్

  • Published By: vamsi ,Published On : September 20, 2019 / 01:00 PM IST
ప్రమాదానికి గురైన బోటు యజమాని, మరో ఇద్దరు అరెస్ట్

Updated On : September 20, 2019 / 1:00 PM IST

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు, కచ్చులూరు మధ్య గోదావరి నదిలో రాయల్ వశిష్ట బోటు ప్రమాదానికి కారణమైన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. రాయల్ వశిష్ట బోటు యాజమాని నిందితుడు కోడిగుడ్ల వెంకటరమణ, ఎల్లా ప్రభావతి, అచ్యుత రమణిలను అరెస్ట్ చేసినట్లు రంపచోడవరం ఏఎస్పీ వకుల్ జిందాల్ ప్రకటించారు.

ఏ-వన్ కోడిగుడ్ల వెంకటరమణ, ఏ-2గా ఎల్లా ప్రభావతి, ఏ-3గా యర్రంశెట్టి అచ్యుత రమణిలను అరెస్ట్ చేసిన పోలీసులు మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టారు. నిందితులను రంపచోడవరం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన రోజు గోదావరి వరద ప్రవాహం ఉధృతంగా నడుస్తుంటే.. బోటును నదిలోకి పంపి యాజమాన్యం బోటు ప్రమాదానికి కారణమైందని పోలీసులు ప్రాథమికంగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే  బోటు ఓనర్స్ , టూర్స్ అండ్ ట్రావెల్స్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.

ప్రమాదం జరిగిన రోజు దేవీపట్నం పోలీస్ స్టేషన్లో బోటు సిబ్బందిపై పలు కేసులు పెట్టినట్లు ఏఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. అనుభవం లేని బోటు డ్రైవరే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటు డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిందని డబ్బులు కోసం గోదావరి ప్రవాహం ఉధృతంగా ఉన్నా బోటు నడిపినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఈ ప్రమాదంలో 26 మందిని కచ్చులూరు గ్రామస్థులు కాపాడగా ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ప్రమాదంలో 34 మంది చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా 15మంది ఆచూకీ తెలియవలసి ఉందని అన్నారు.