ఈ బొమ్మను వెతికి తెస్తే రూ. 4 లక్షలు బహుమతి : హీరో ప్రకటన

మనుషులు తప్పిపోతే టీవీలు, పేపర్లలో ప్రకటనలు ఇస్తాం..బస్సులపైనా..జనాలు తిరిగేప్రాంతాల్లో కరపత్రాలు అంటిస్తాం. కానీ ..నా టెడ్డీబేర్ బొమ్మ పోయిందని..నా టెడ్డీబేర్ ను వెతికి తెచ్చిస్తే రూ.4 లక్షలు బహుమానంగా ఇస్తానని ఆ బొమ్మ యజమాని ప్రకటన చూసినవారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఆఫ్ట్రాల్ ఓ బొమ్మ పోయిందని ప్రకటన ఇవ్వటమా..పైగా దానికి రూ.4లక్షల బహుమతా? ఆ బొమ్మలో ఏముందో? వజ్రాలేమన్నా ఉన్నాయా? లేదా ఆ బొమ్మను బంగారంతో చేశారా? అనే అనుమానం వస్తుంది. ఆ బొమ్మలో ఏదో పెద్ద విశేషం లేకపోతే అంత పెద్ద మొత్తాన్ని బహుమతిగా ఎలా ఇస్తారు అనే అనుమానం కచ్చితంగా వస్తుంది. మీ అనుమానం కొంతవరకూ నిజమే. కానీ ఆ బొమ్మలో ఏ వజ్రాలు లేవు..అది బంగారంతోనూ చేయలేదు. మరి విశేషమేంటో తెలుసుకుందాం..
ఎందుకుంటే ఆ బొమ్మలోంచి “ఐ లవ్ యూ”, “నిన్ను చూసి గర్విస్తున్నాను”, “నేనెప్పుడూ నీ వెంటే ఉన్నాను” అన్న మాటలు వినిపిస్తాయి. ఆ మాటలు గతేడాది చనిపోయిన ఆమె తల్లి చివరి మాటలు. ఆ బొమ్మలో అమ్మను, అమ్మ మాటలను చూస్తూ వింటోందామె. అందుకే ఆ బొమ్మ అంటే ఆమెకి పంచప్రాణాలు అయ్యాయి. ఈ క్రమంలోనే తన టెడ్డీబేర్ తిరిగిచ్చేయండంటూ సోషల్ మీడియాలో వేడుకుంది.
కెనడాకు చెందిన మారా సోరియాన్ అనే మహిళ నాలుగు రోజుల క్రితం అంటే జూలై 24న ఇల్లు మారింది. అలా ఇల్లు మారే సమయంలో తనకు ఎంతో ఇష్టమైన ప్రాణప్రధానమైన ‘‘టెడ్డీబేర్’’ బొమ్మ కనిపించకుండాపోయింది. ఆ బొమ్మ అంటే ఆమెకు పంచ ప్రాణాలు. ఆ బొమ్మ అమ్మకు గుర్తు..అమ్మ గొంతు వినిపించే అపురూపమైన ఆలంబన.
కాన్సర్ తో పోరాడీ పోరాడీ గత జూన్ నెలలో సోరియాన్ 53 ఏళ్ల తల్లి చనిపోయింది. చనిపోయే ముందు ఆమె “ఐ లవ్ యూ”, “నిన్ను చూసి గర్విస్తున్నాను”, “నేనెప్పుడూ నీ వెంటే ఉన్నాను” అన్న మాటల్ని ఓ ఐపాడ్ లోరికార్డు చేసి ఓ టెడ్డీబేర్ బొమ్మలో పెట్టి కూతురికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఆ తరువాత ఆమె క్యాన్సర్ మహమ్మారికి బలైపోయింది. అప్పటి నుంచి తల్లి తనకు ధైర్యం చెబుతున్నట్లు..తల్లి ఎప్పుడూ తనతోనే ఉన్నట్లుగా ఆ బొమ్మలోంచి వినిపించే మాటలతో సేదదీరుతుంటుంది సోరియాన్. ఈ క్రమంలో సోరియన్ జులై 24న ఇల్లు మారేక్రమంలో ఆ బొమ్మను పోగొట్టుకుంది.అప్పటి నుంచి తల్లి మాటలు వినిపించక తల్లడిల్లిపోతోంది. తల్లి తనకు దూరమైపోయినట్లుగా ఆవేదన చెందుతోందామె.
టెడ్డీబేర్ కనిపించకుండా పోయిన వెంటనే దానికోసం అంతా వెదికింది. అయితే ఆ బొమ్మతో పాటు తన ఐపాడ్ కూడా కనిపించకపోవడంతో.. ఎవరో దొంగతనం చేశారని ఆమెకు అర్థమైంది. దీంతో ఆమె ఆ బొమ్మ తనకు ఎంత ముఖ్యమైందో వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె పోస్టును డెడ్‌పూల్ స్టార్ హీరో ర్యాన్ రెనాల్డ్స్ చూశాడు. వెంటనే ఆయన ఆ బొమ్మను ఆమె దగ్గరికి చేర్చినవారికి 5 వేల డాలర్లు (దాదాపు రూ. 4 లక్షలు) ఇస్తానని ప్రకటించాడు. ఆమెకు తిరిగి బొమ్మ దొరికేంతవరకు మనమందరు సాయం చేయాలని కోరాడు. చూడాలి మరి ఆ బొమ్మ(అమ్మ) ఆమె చెంతకు చేరుతుందా లేదా అనేది వేచి చూడాలి. మరి అమ్మ అపురూప జ్ఞాపకం ఆమె చెంతకు చేరాలని కోరుకుందాం..
Vancouver: $5,000 to anyone who returns this bear to Mara. Zero questions asked. I think we all need this bear to come home. https://t.co/L4teoxoY50
— Ryan Reynolds (@VancityReynolds) July 25, 2020