నేనలా అనలేదు.. నా మాటలు వక్రీకరించారు: రాజధాని మార్పుపై బొత్స

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధానిలో ప్రస్తుత వరదల నేపథ్యంలోనే తాను మాట్లాడానని దానిని ఇష్టం వచ్చినట్లు అన్వయించుకున్నారని అన్నారు.
అమరావతిలో టీడీపీ నేతల భూములే ఉన్నాయని అందుకే రచ్చ చేస్తున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అసత్య ప్రచారాలకు తెరలేపారని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కేవలం శివరామకృష్ణన్ రిపోర్టుని పరిగణలోకి తీసుకోలేదని మాత్రమే చెప్పానని, శివరామకృష్ణన్ రిపోర్ట్ కాకుండా నారాయణ రిపోర్టు అమలు చేశారని ఆరోపించారు.
చెన్నై ముంబై వంటి నగరాల్లో వరదలు వస్తే రాజధానిని తరలిస్తారా? అంటూ చంద్రబాబు మాట్లాడిన మాటలపై స్పందించిన బొత్స చెన్నై ముంబై నగరాలు ఎప్పుడో కట్టిన రాజధానులు అని, ఇప్పుడైతే వేరేలా ఉండేదని అన్నారు. ముంపునకు గురవుతుందని తెలిసి ఉంటే అక్కడ రాజధాని కట్టేవారా అని నిలదీశారు.
పదేళ్ల క్రితం 12 లక్షల క్యూసెక్కులకు నీరు వస్తే అతలాకుతలం అయ్యిందని, మెున్న 8లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిందని చెప్పారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలన్నదే వైసీపీ ప్రభుత్వం ఆలోచన అన్నారు.