ఉన్నదంతా ఊడ్చేశారు : ఎన్నికల ఖర్చు రూ.10కోట్లు

  • Published By: veegamteam ,Published On : April 16, 2019 / 04:26 PM IST
ఉన్నదంతా ఊడ్చేశారు : ఎన్నికల ఖర్చు రూ.10కోట్లు

విజయవాడ : ఎన్నికల్లో గెలిచేందుకు… అభ్యర్ధులు ప్రజలపై కోట్ల రూపాయల నోట్ల వర్షం కురిపించారు. సాధారణ పోటీ ఉన్న చోట ఒక్కో అభ్యర్ధి 10 కోట్లు ఖర్చు పెడితే… గట్టి పోటీ ఉన్న చోట లెక్కకు మించి ఖర్చు అయింది. కృష్ణా జిల్లాలోని చాలా నియోజికవర్గాల్లో అభ్యర్ధులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నోట్లను నీళ్లలా ఖర్చు చేశారు. మరి నోట్లు ఓట్లు రాల్చాయా.. అభ్యర్ధులకు విజయం అందిస్తాయా..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ప్రధాన పార్టీలకు డూ ఆర్ డై గా మారాయి. అభ్యర్ధులు పార్టీ, పలుకుబడి కన్నా.. పైసానే నమ్ముకున్నారు. ఖర్చుకు ఎక్కడా వెనుకాడలేదు. ఎమ్మెల్యే మొదలుకొని ఎంపీ వరకు అందరూ ప్రజలపై డబ్బు వెదజల్లారు. గెలుపే లక్ష్యంగా.. కోట్లు కుమ్మరించారు. టిక్కెట్ ఖారారు చేసినప్పటి నుంచి ప్రచారం ముగిసే వరకు నోట్ల వరద పారించారు. పక్కాగా అభ్యర్ధిత్వం దక్కతుందనే నమ్మకంతో ముందు నుంచే కొందరు అభ్యర్ధులు ప్రచార రంగంలోకి దిగారు. కీలక వర్గాలను తమ వైపు తిప్పుకునేలా సమావేశాలు ఏర్పాటుచేశారు. డబ్బులతో పాటు విందులు, వినోదాలతో వారి సత్తా చాటుకునేలా భారీ ప్రదర్శనలు, రోడ్‌ షోలు నిర్వహించారు. నామినేషన్ దాఖలు చేసేందుకే కొందరు అభ్యర్ధులు 20 నుంచి 50 లక్షలు ఖర్చు చేశారంటే…. ఈ ఎన్నికల్లో ధన ప్రవాహం ఏమేర సాగిందో అర్ధమవుతుంది.

ఒక్కో అభ్యర్ధి ప్రచారం కోసమే రోజుకు 10 నుంచి 15 లక్షలు ఖర్చు పెట్టారని అనధికార వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధినేతలు వచ్చిన సమయంలో .. జనసమీకరణ కోసం నోట్ల కట్టలు హారతి కర్పూరంలా కరిగిపోయాయని కొందరు అభ్యర్ధులు తలలు పట్టుకున్నారట. ప్రజలను సమావేశాలకు తీసుకురావడానికి .. ఒక్కొక్కరికి రోజుకు 500 నుంచి 700 రూపాయల వరకూ ఖర్చు చేశారు. ఎక్కడికక్కడ ప్రత్యర్ధులకు మించి జనసమీకరణ చేయడాన్ని ప్రస్టేజ్ ఇష్యూగా తీసుకుని .. డబ్బును వెదజల్లారట.

ఎన్నికలు పూర్తి కావడంతో.. ఎంత ఖర్చైందనే దానిపై ప్రధాన పార్టీల అభ్యర్ధులు లెక్కలు వేసుకుంటున్నారట. ఎన్నికల్లో 7 కోట్ల నుంచి 10 కోట్లు ఖర్చైందని తేలడంతో.. తమ అనుచరుల దగ్గర గొల్లుమంటున్నారట. కృష్ణా జిల్లాలోని కొన్ని స్థానాల్లో ప్రత్యర్ధులను మట్టి కరిపించేందుకు టీడీపీ, వైసీపీ అభ్యర్ధులు ఉన్నదంతా ఊడ్చేశారనే ప్రచారం జరుగుతోంది. మైలవరం, గుడివాడ, గన్నవరం, విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్ వంటి ప్రాంతాల్లో .. అభ్యర్ధులు రూ.20 నుంచి 30 కోట్లు వరకూ ఖర్చు చేశారంటే.. ఈ సారి ఎన్నికల్లో ధన ప్రవాహం ఏమేరకు ఉందో అర్ధం చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఓటుకు నోటు కాదు.. ఓటుకు నోట్లను పారించారు. ప్రచారం నుంచి ఎన్నికలు ముగిసే వరకూ ఎక్కడా ఖర్చుకు వెనకాడలేదు. గెలుస్తామనే ధీమాతో కోట్లు కుమ్మరించారు. మరి ఓటుకు.. నోటు ఫలిస్తుందా.. అనుకున్న విధంగా అభ్యర్ధులు విజయం సాధిస్తారా అన్నది తేలాలంటే మే 23 వరకు ఆగాల్సిందే.