23వ రోజు రాజధాని రైతుల ఆందోళనలు

  • Published By: vamsi ,Published On : January 9, 2020 / 05:44 AM IST
23వ రోజు రాజధాని రైతుల ఆందోళనలు

Updated On : January 9, 2020 / 5:44 AM IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మూడు రాజధానులు తరలింపు అంశంపై ఆగ్రహావేశాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. రైతులు, ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తుండగా.. ఈ క్రమంలోనే రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన 23వ రోజుకు చేరుకుంది.

నిరసనల్లో భాగంగా ఇవాళ(09 జనవరి 2020) తుళ్లూరు, వెలగపూడి, మందడం తదితర గ్రామాల్లో గురువారం ఉదయం నుంచే రైతులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు.

తుళ్లూరు ధర్నా చౌక్‌లో కొనసాగుతున్న దీక్షలకు సంఘీభావంగా దళిత జేఏసీ నాయకులు ఒక రోజు దీక్షకు సిద్ధమయ్యారు. మూడు రాజధానులు వద్దు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, ‘సేవ్‌ అమరావతి’ అంటూ నినాదాలు చేస్తున్నారు రైతులు.

మందడంలో రైతులు రోడ్డుపైనే టెంటు వేసుకుని దీక్ష కొనసాగిస్తున్నారు. జాతీయ జెండా, మోదీ ఫ్లెక్సీలతో పలువురు ధర్నాలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వద్ద డబ్బుల్లేకపోతే శ్రమదానంతో రాజధాని నిర్మించుకుంటామంటూ పలువురు రైతులు అంటున్నారు.