ఇక భయం లేదు : ఆరోగ్యశ్రీ పరిధిలోకి డెంగీ, మలేరియా

ఏపీలో జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీజనల్ వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలని నిర్ణయించింది. డెంగీ, మలేరియా సహా అన్ని రకాల సీజనల్‌ వ్యాధులను

  • Published By: veegamteam ,Published On : September 13, 2019 / 03:37 AM IST
ఇక భయం లేదు : ఆరోగ్యశ్రీ పరిధిలోకి డెంగీ, మలేరియా

Updated On : September 13, 2019 / 3:37 AM IST

ఏపీలో జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీజనల్ వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలని నిర్ణయించింది. డెంగీ, మలేరియా సహా అన్ని రకాల సీజనల్‌ వ్యాధులను

ఏపీలో జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా వెళ్తోంది. సీజనల్ వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలని చూస్తోంది. డెంగీ, మలేరియా సహా అన్ని రకాల సీజనల్‌ వ్యాధులను వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురానుంది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో సుమారు 21 రకాల సీజనల్‌ వ్యాధులు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తాయి. వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తామన్న సీఎం జగన్‌ ప్రకటనకు అనుగుణంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటివరకూ కేవలం సూపర్‌ స్పెషాలిటీ సేవలు, ప్రసూతి సేవల కింద వచ్చే శస్త్రచికిత్సలు మాత్రమే ఆరోగ్యశ్రీలో ఉండేవి. ఇకపై వెయ్యి రూపాయలు దాటిన ప్రాథమిక చికిత్సలను కూడా దీని పరిధిలోకే రానున్నాయి.  ప్రస్తుతం 1,059 శస్త్రచికిత్సలు కాకుండా కొత్తగా వెయ్యి చికిత్సలకు అనుమతులు ఇవ్వనున్నారు. కొత్త చికిత్సలను 2020 జనవరి 1నుంచి పైలట్‌ ప్రాజెక్టు కింద పశ్చిమగోదావరి జిల్లాలో 2 నెలల పాటు అమలు  చేయనున్నారు. పథకం అమలులో వచ్చే ఇబ్బందులను తొలగించుకుని, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని యోచిస్తున్నారు.

మలేరియా, డెంగీ జ్వరాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలని ఆరోగ్యశ్రీ అమలుపై ఏర్పాటైన నిపుణుల కమిటీ భావిస్తోంది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సుజాతారావు అధ్యక్షతన గురువారం(సెప్టెంబర్ 12,2019) జరిగిన  ఈ కమిటీ సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. ఓ నివేదికను రూపొందించారు. ఈ నివేదికను సెప్టెంబర్ 18 లేదా 19న సీఎం జగన్‌ కి ఇవ్వనున్నారు. వెయ్యి రూపాయలు బిల్లు దాటితే ఆ వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తామని ప్రజా సంకల్ప యాత్రలో సీఎం జగన్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కమిటీ 2 నెలలపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, గ్రామాలు, ఆస్పత్రులకు వెళ్లి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి జ్వరాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని తేల్చింది. సీఎంకు అందించే నివేదికలో దీనిపై స్పష్టత ఇవ్వనున్నారు.

మరోవైపు బీపీ, షుగర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులకయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరించనుంది. ఈ వ్యాధులతో బాధపడుతున్న వారు కేవలం మందులు కొనుగోలు చేసుకుంటే సరిపోతుంది. ఇవికాకుండా ఏదైనా సమస్యతో 24గంటల పైన ఆస్పత్రిలో చికిత్స పొందినా ఆరోగ్యశ్రీ వర్తించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సీజనల్‌ వ్యాధులతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల వల్ల వచ్చే సమస్యలను ‘డే కేర్‌’ సేవల కిందకు తీసుకురానున్నారు. మొత్తం 2వేల జబ్బులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం లభించనుంది. తాజాగా పెంచిన జబ్బుల లిస్టు ప్రకారం ఏడాదికి రూ.1,500 కోట్లు వ్యయమవుతుందని అధికారులు అంచనా వేశారు. అలాగే, వెయ్యి రూపాయల బిల్లు దాటిన జబ్బులను కూడా పథకం పరిధిలోకి తెస్తే మరో రూ.1,500 కోట్లు వ్యయమవుతుందని.. మొత్తం రూ.3 వేల కోట్లు ఏడాదికి ఖర్చు చేయాల్సి వస్తుందని నిపుణుల కమిటీ అంచనా వేసింది.

మరోవైపు.. ప్రస్తుతమున్న ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో కొత్త కార్డులు జారీ చేయడం.. ఆరోగ్యమిత్రల వ్యవస్థను బలోపేతం చేయడం.. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సంఖ్యను పెంచడం.. బాధితులకు వైద్యసేవలు, బిల్లుల  విషయంలో పారదర్శకంగా వ్యవహరించేందుకు చర్యలు తీసుకోవడం వంటి వాటిని పకడ్బందీగా అమలుచేయాలని కమిటీలోని పలువురు నిపుణులు సూచనలిచ్చారు. సీజనల్ వ్యాధులు ఏటేటా పెరిగిపోతున్నాయి. డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల కారణంగా అనేకమంది మంచాన పడుతున్నారు. కొందరు చనిపోతున్నారు. సీజనల్ వ్యాధుల సమయంలో వైద్యం కోసం చాలా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది పేద, మధ్య తరగతి వర్గాల వారికి ఆర్థిక భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తే చాలా ఊరట లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.