MSP కోసం రోడ్డెక్కిన రైతన్నలు

నిజామాబాద్ : పసుపు, ఎర్రజొన్న రైతుల ఆందోళనతో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ అట్టుడికింది. అన్నదాతల నిరసనలతో హోరెత్తింది. రైతులు, రైతు సంఘాల నాయకులు అరెస్టుతో పట్టణంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పసుపు, ఎర్రజొన్న రైతులు రోడ్డెక్కారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్న డిమాండ్‌తో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో అన్నదాతలు నిర్వహించిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
జిల్లాలో పసుపు, ఎర్రజొన్నలు ఈసారి బాగా పండాయి. దిగుబడి పెరిగిందన్న సంతోషం రైతులకు ఎంతోకాలం నిలువలేదు. పంటలను అమ్ముకుందామని మార్కెట్‌లకు తీసుకెళ్తే వ్యాపారులు ధరలు దారుణంగా తగ్గించారు. పసుపు క్వింటాలుకు 15 వేల రూపాయల ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎర్రజొన్నలకు క్వింటాలుకు కనీసం రూ.3,500 రూపాయలైనా ఇవ్వాలని కోరారు. కానీ రైతుల మొరను ప్రభుత్వం ఆలకించండంలేదు. ఉత్పత్తి వ్యయాలు పెరిగి ధరలు దారుణంగా పడిపోయిన తరుణంలో కనీస మద్దతు ధరలు కూడా ఇవ్వకపోవడంతో కడుపు మండిన రైతులు ..రోడ్డెక్కి ధర్నాలు నిర్వహించారు.
పసుపు, ఎర్రజొన్న రైతులు ఆందోళనకు దిగడం ఈ వారంలో ఇది రెండోసారి. ఈనెల 7న మామిడిపల్లి చౌరాస్తాలో ధర్నాచేసిన రైతులతో చర్చలు జరిపిన ప్రభుత్వ అధికారులు.. మద్దతు ధరలపై సర్కారుకు నివేదిక పంపిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయం కోసం రైతులు నిన్నటివరకు ఎదురుచూశారు. సర్కారు నుంచి స్పందన లేకపోవడంతో ఇవాళ మళ్లీ ఆందోళన బాట పట్టారు.
రైతుల ఆందోళన నేపథ్యంలో పట్టణంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు. ధర్నాకు రైతులను సమీకరిస్తున్న నాయకులతోపాటు ఆందోళనలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న పలు సంఘాల నాయకులను ముందుగానే అరెస్టు చేశారు. పసుపు, ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధరలు కల్పించే వరకు ఆందోళన ఆగదని రైతులు తెగేసి చెప్పారు. కనీస మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే ఎర్రజొన్నలు, పసుపు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.