రాయలసీమకు వరదలు : కర్నూలు జిల్లాలో భారీ వర్షం

  • Published By: madhu ,Published On : September 21, 2019 / 02:21 AM IST
రాయలసీమకు వరదలు : కర్నూలు జిల్లాలో భారీ వర్షం

Updated On : September 21, 2019 / 2:21 AM IST

రాయలసీమ అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది కరువు. కానీ ప్రస్తుతం అక్కడ వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. భారీగా వర్షాలు కురుస్తుండడంతో వరదలు పోటెత్తుతున్నాయి. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. ప్రధానంగా కర్నూలు జిల్లాలను వరుణుడు వీడడం లేదు. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం అత్యధికంగా 14.4 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. రుద్రవరంలో 12.6 సెం.మీటర్ల వర్షం కురిసింది. వరద ప్రాంతాల్లో మంత్రి బోత్స సెప్టెంబర్ 21వ తేదీ శనివారం పర్యటించనున్నారు. 

జిల్లాలోని ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ, గడివేముల, చాగలమర్రి, మహానంది, శిరువెళ్ల, గోస్సాడు, బండిఆత్మకూరు, సంజామల మండలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరద ధాటికి కుందూ నదిలో రికార్డు స్థాయిలో 60 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. ఎర్రవంక పొంగి కల్వర్టు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చెంచుగూడెం ప్రాంతంలో నిత్యావసర సరుకులు లేక అల్లాడిపోతున్నారు. పలు ప్రాంతాల్లోని వంతెనలు వరదకు కొట్టుకపోయాయి. జిల్లాల్లో కురిసిన వర్షానికి సుమారు రూ. 670 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. 

కడప జిల్లాల్లో కరువు తాండవం చేస్తుంటుంది. అలాంటిది ఇక్కడకు వరద నీరు పోటెత్తింది. ప్రోద్దుటూరు మండలంలోని బంకచిన్నాయపల్లెకు నీరు వచ్చి చేరింది. కుందూ నదికి ప్రవాహం పెరగడంతో ఈ గ్రామం వరద నీటిలో చిక్కుకపోయింది. ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
Read More : పోలవరంపై మాటల యుద్ధం : జగన్ మేధావా