హత్రాస్ బాధితురాలి తల్లిని క్రైంసీన్ దగ్గరకి తీసుకెళ్లిన సీబీఐ

Hathras Victim’s Mother Taken To Crime Scene దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై ఇవాళ(అక్టోబర్-13,2020) సీబీఐ విచారణ ప్రారంభించింది. మంగళవారం మధ్యాహ్నం బాధితురాలి స్వగ్రామానికి చేరుకున్నసీబీఐ అధికారుల బృందం…డిప్యూటీ సూపరిండెంటెండ్ ఆఫ్ పోలీస్ సీమా పహుజా నేతృత్వంలో, ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు అధికారులు, బాధితురాలి తల్లి,సొదరుడితో కలిసి ఘటనాస్థలాన్ని(యువతిపై లైంగికదాడి జరిగిన పొలం) పరిశీలించింది.
క్రైంసీన్ దగ్గర బాధితురాలి తల్లిని అనేక వివరాలు అడిగి తెలుసుకుంది సీబీఐ బృందం. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను, అనంతరం అంబులెన్సులో ఇంటికి తరలించారు. దాదాపు రెండుగంటల పాటు క్రైంసీన్ దగ్గర ఉన్న సీబీఐ బృందం.. ఆ తర్వాత బాధితురాలి ఖననం జరిగిన ప్రదేశానికి వెళ్లి పరిశీలించింది.
కాగా,హత్రాస్ ఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్-30న ఈ కేసు విచారణకై తొలుత ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించింది. ఏడు రోజుల్లోగా నివేదిక అందించాలని ఆదేశించింది. ఆ తర్వాత మరో పది రోజుల పాటు సమయం కావాలని సిట్ కోరడంతో గడువును పొడిగించింది. ఇక ఈ కేసులో ఆది నుంచి పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిని సీబీఐకి అప్పగించాల్సిందిగా డిమాండ్లు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. దీంతో ఆదివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ…ఐపీసీ సెక్షన్లు 376-D(సామూహిక లైంగిక దాడి), 307(హత్యాయత్నం), 302(హత్య)తో పాటు ఎస్సీ- ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసింది. క్రైం సీన్ దగ్గర ఆధారాలు సేకరించేందుకు ఇవాళ ఫోరెన్సిక్ నిపుణులను సీబీఐ అక్కడికి తీసుకువెళ్లింది. గతంలో షిమ్లా అత్యాచారం, హత్య కేసును విచారించిన సీమా పహుజా నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో సెప్టెంబర్- 14న 19 ఏళ్ళ దళిత యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. తల్లితో కలిసి పొలంలో గడ్డి కోస్తున్న బాధితురాలిని లాక్కెళ్లి చిత్ర హింసలకు గురిచేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. నాలుక కోసి, వెన్నెముక విరిగేలా రాక్షసంగా వ్యవహరించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలికి తొలుత అలీఘర్‌లో ట్రీట్మెంట్ అందించినా ఫలితం లేకపోవడంతో, ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ హాస్పిటల్ కి తరలించారు. పక్షవాతంతో పాటు శరీరంలోని కీలక అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో రెండు వారాలు చిత్రవధ అనుభవించిన బాధితురాలు మృత్యువుతో పోరాడుతూ సెప్టెంబర్ 29న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఇక అదేరోజు అర్థరాత్రి కుటుంబసభ్యులకు కూడా సమాచారం అందించకుండా పోలీసులే బాధితురాలి శవాన్ని దహనం చేయడం తీవ్రవిమర్శలకు దారితీసింది.