మదగొండపల్లిలో జల్లికట్టు : పోలీసులపై రాళ్ల దాడి

  • Published By: madhu ,Published On : February 20, 2019 / 12:57 PM IST
మదగొండపల్లిలో జల్లికట్టు : పోలీసులపై రాళ్ల దాడి

కుప్పం సరిహద్దు…తమిళనాడు రాష్ట్రం..కృష్ణగిరి జిల్లాలోని మదగొండపల్లిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. జల్లికట్టు పోటీలకు అనుమతి లేదని చెప్పడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనక్కితగ్గని గ్రామస్తులపై పోలీసులు లాఠీఛార్జీకి దిగారు. తీవ్ర కోపోద్రిక్తులై రాళ్ల దాడికి పాల్పడ్డారు. వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసులను ఊరి బయటి వరకు తరిమి తరిమి కొట్టారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. 

సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలో కోళ్ల పందేలతో పాటు జల్లికట్టు పోటీలు జరుగుతుంటాయి. ఫిబ్రవరి నెలలో మదగొండపల్లిలో జల్లికట్టు పోటీలను నిర్వహిస్తుంటారు. ఫిబ్రవరి 20వ తేదీ బుధవారం పోటీల కోసం గ్రామస్తులు రెడీ అయ్యారు. దీనికి పోలీసులు నో చెప్పారు. జల్లికట్టును నిర్వహిస్తామని గ్రామస్తులు ఖరాఖండిగా చెప్పారు. పోలీసులు ఎంత నచ్చచెప్పినా వినిపించుకోలేదు. చివరకు లాఠీలకు పని చెప్పారు. అప్పటికే తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్న గ్రామస్తులు పోలీసులపైకి తిరగబడ్డారు. రాళ్లతో దాడి చేశారు.

అక్కడున్న రెండు వాహనాలను ధ్వంసం చేశారు. ఊరి బయటి వరకు పరుగెత్తించారు. గ్రామస్తుల దాడిలో 10 మంది పోలీసులకు గాయాలు కాగా..లాఠీ ఛార్జీలో పలువురు గ్రామస్తులకు గాయాలయ్యాయి. పోలీసులను కృష్ణగిరి హాస్పిటల్‌కు తరలించారు. వీరిలో కొంతమంది పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. నివేదికను సమర్పించాల్సిందిగా కలెక్టర్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం.