జనసేన ఎమ్మెల్యే రాపాక ఆసక్తికర వ్యాఖ్యలు : పార్టీ నిర్మాణం సరిగా లేదు

జనసేన పార్టీ తరపు నుంచి నెగ్గిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ నిర్మాణం సరిగ్గా లేదనీ..అదే విషయాన్ని పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కు చెప్పానని అన్నారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన ‘రైతు సౌభాగ్య దీక్ష’కు నేను వెళ్లటం లేదని రాపాక స్పష్టం చేశారు.
అలాగని తాను పార్టీ మారతానని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. పార్టీ నిర్మాణం సరిగా లేదనందువల్లనే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారనీ..నిర్మాణం సరిగా లేనందు వల్లనే తాను అసంతృప్తితో ఉన్నాను తప్ప పార్టీ మారటంలేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ నిర్మాణంలో లోపాలు చాలా ఉన్నాయనీ వాటిని సరిదిద్దుకోమని పవన్ కు సూచించానని అన్నారు. తాను బైటకెళ్లితే జనసైనికులు నాతో సెల్ఫీలు తీసుకుంటున్నారనీ..వారంతా పవన్ కళ్యాణ్ ను నాలో చూసుకుంటున్నారనీ అన్నారు.
కాగా 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో సహా పోటీ చేసిన ఎమ్మెల్యేలంతా ఓడిపోయారు. పార్టీ తరపు నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రమే విజయం సాధించారు. ఇటీవల కాలంలో పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక పార్టీ మారతారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తల్ని రాపాక ఖండించారు.
ఈ క ్రమంలో ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం అంశం గురించి ఏపీ అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియాన్ని స్వాగతించారు. పేద విద్యార్థుల కోసం సీఎం జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ఇంగ్లీష్ మీడియం విషయంలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తుంటే..ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక మాత్రం జగన్ పై ప్రశంసలు కురిపించటంతో ఆయన పార్టీ మారతారనే వార్తలు మరోసారి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.