ఆ బావి నీళ్లు తాగితే కరోనా పోతుందట

భాబిజీ పాపడ్ తింటే కరోనా తగ్గుతుందని ఒకరు.. హనుమాన్ చాలీసా చదివితే కరోనా దరిచేరదని మరొకరు..అయోధ్యలో శ్రీరాముడు గుడి కట్టటం ప్రారంభిస్తే కరోనా ఖతం అయిపోతుందని..మా షాపులో మూలికలతో తయారు చేసిన మైసూర్ పాక్ తింటే కరోనా రాదనీ..ఒకవేళ వచ్చినా..తగ్గిపోతుందని ఇంకొకరు ఇలా రోజుకొకరు జోరుగా ప్రచారం చేసేస్తున్నారు. తాజాగా ఓ బావిలో ఉన్న నీళ్లు తాగితే కరోనా వైరస్ రానే రాదని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో చుట్టుపక్కల ఉన్నవాళ్లు వచ్చి ఆ బలిలోని నీళ్లు తెగ తోడుకుని పట్టుకుపోతున్నారు.
ఆ బావి కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండలం మొలంగూర్ అనే గ్రామంలో ఉన్నది. ఈ బావిల ఉండే నీరుకి సర్వరోగ నివారిణి అనే పేరుంది. ఈ కరోనా సమయంలో ఆ బావిలో నీరు తాగితే కరోనా రాదనీ పుకార్లు షికార్లు చేయటంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆ బావిలోని నీటిని తీసుకొని వెళ్తున్నారు. అది వట్టి పుకారని చెప్పినా కూడా ప్రజలు వినడం లేదు. నిన్న మొన్నటి వరకు మినరల్ వాటర్ తాగేవాళ్ళు కూడా కరోనా వైరస్ భయంతో ఆ బావి నీళ్లు తాగడం మొదలెట్టారు. కరోనా రాదని ఏం చెప్పినా..ఎవరు చెప్పినా..ప్రజలు నమ్మేస్తున్నారు. దటీజ్ కరోనా. కరోనా పేరుతో జరుగుతున్న మోసాలకు కూడా ప్రజలు బలైపోతున్నారు. ఈక్రమంలో ఇది చేస్తే..కరోనా రాదని ఎవరు ఏం చెప్పినా చేసేస్తున్నారు.