విశాఖలో భారీ బహిరంగ సభకు జనసేన ప్లాన్.. జనసేన ఫ్యూచర్‌కు మరింత బూస్ట్.. ఇక 2029 ఎన్నికల్లో..
విశాఖ సభలో పవన్ ఎవరిని టార్గెట్ చేస్తారు? లేకపోతే జనసేన పార్టీ యాక్టివిటీ, ఫ్యూచర్‌ప్లాన్స్ గురించి మాత్రమే మాట్లాడి వదిలేస్తారా? అన్నది డిస్కషన్ పాయింట్ అయింది.

Visakha Sabha
Visakha Sabha: ఒంటరిగా నిలబడి..ఒక్కడై పోరాడి..కూటమిగా జతకట్టి..గెలుపులో కీలక పాత్ర పోషించి..సత్తా చాటిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జనసేన భవిష్యత్‌పై సీరియస్ ఫోకస్ పెట్టినట్లే కనిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వం, పాలన మీదనే ఎక్కువ దృష్టిపెట్టారు పవన్. పిఠాపురంలో జనసేన ప్లీనరీ తప్ప..పెద్దగా జనసేన మీటింగ్‌లు నిర్వహించలేదు. జిల్లాల పర్యటనలు చేసినా అధికారిక టూర్లుగానే ముగిశాయి.
కానీ ఇప్పుడు విశాఖ వేదికగా అతిపెద్ద సభకు ప్లాన్ చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఈ నెల 30న విశాఖలో 15వేల మంది జనసైనికులతో మహాసభ పెడుతున్నారు. జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున సభకు తరలి రానున్నారు. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే. ఆగస్ట్ 30న సభ. మధ్యలో ఒక్క రోజు గ్యాప్‌లో రెండు పెద్ద ఈవెంట్లు ఉన్నాయి. విశాఖ సభ అటు పార్టీ మీటింగ్‌గాను..ఇటు సేనాని బర్త్ డే ఈవెంట్‌గానూ జరిగే అవకాశం ఉంది.
Also Read: Vinayaka Chavithi 2025: గణేశ్ మండపాలు పెడుతున్నారా? ప్రభుత్వం గుడ్‌న్యూస్
ఓట్లు సీట్లతో సంబంధం లేకుండా..ఓడినా, గెలిచినా జనంలోనే ఉండి..జనసేనానిగా ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో పాలిటిక్స్‌లోకి వచ్చిన పవన్..పరిస్థితులకు తగ్గట్లుగా తన పొలిటికల్ వ్యూహాలను మార్చుకుంటూ వచ్చారు. సరిగ్గా 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాటులో కీరోల్ ప్లే చేసి ఏపీ రాజకీయాలను కొత్త మలుపు తిప్పారు. (Visakha Sabha)
మళ్లీ వైసీపీదే అధికారమని అంచనాలున్న నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీని ఒక్కతాటిపై నిలబెట్టి ఎన్నికల సమరంలో ప్రభంజనం సృష్టించి.. కీలకమైన డిప్యూటీ సీఎం పదవిలో కొనసాగుతున్నారు. సేమ్‌టైమ్ కేంద్ర పెద్దలతో అత్యంత దగ్గరి సంబంధాలు మెయింటెన్ చేస్తున్నారు. సౌత్‌లో కీలక నేతగా ఎదుగుతున్నారు. ఈ టైమ్‌లో సాగర తీరంలో మహాసభకు ప్లాన్ చేశారు పవన్ కల్యాణ్.
ప్రత్యేక రాజకీయ గుర్తింపును నిలుపుకోవాలనే..
ప్రస్తుతం జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి అధికారంలో ఉన్నప్పటికీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ప్రత్యేక రాజకీయ గుర్తింపును నిలుపుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2029 ఎన్నికల సమీకరణలను దృష్టిలో పెట్టుకుని, జనసేనాని ఎలాంటి వ్యూహాలను రచిస్తారోనన్న ఉత్కంఠ రేపుతోంది. విశాఖ సభతో జనసేన భవిష్యత్ ప్లాన్ ఏంటో మరింత స్పష్టత రానుంది.
ఇప్పటికే కూటమిగా ఉంటాం..చంద్రబాబే ఇంకో పది హేను ఇరవై ఏళ్లు సీఎంగా ఉండాలంటూ పవన్ పలుసార్లు ప్రకటనలు చేశారు. సో కూటమిగా ఉంటారనేది క్లియర్ కట్ డెసిషన్‌గానే కనిపిస్తోంది. వచ్చే ఈ నేపథ్యంలో మహాసభలో పవన్ స్పీచ్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ భవిష్యత్ ప్రణాళికపై పవన్ ఎలాంటి సందేశం ఇస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది.
అపోజిషన్‌లో ఉన్నప్పుడు వైసీపీ మీద ఓ రేంజ్‌లో మండిపడేవారు పవన్. కానీ ఇప్పుడు రోల్ చేంజ్ అయింది. పవన్ అధికారంలో ఉన్నారు. పైగా డిప్యూటీ సీఎం లాంటి పెద్ద పోస్ట్‌లో ఉన్నారు. ఇప్పుడు ఆయన స్పీచ్ ఎలా ఉంటుందనేది చర్చకు దారితీస్తోంది. కూటమిని ఎలాగూ విమర్శించలేరు. ఇక వైసీపీ అపోజిషన్‌లోకి వచ్చి ఏడాదిన్నర అవుతుంది.
ఇప్పటికీ ఆ పార్టీనే తిడితే పాత పాటే పాడినట్లు అవుతుందన్న అభిప్రాయాలు లేకపోలేదు. దీంతో విశాఖ సభలో పవన్ ఎవరిని టార్గెట్ చేస్తారు? లేకపోతే జనసేన పార్టీ యాక్టివిటీ, ఫ్యూచర్‌ప్లాన్స్ గురించి మాత్రమే మాట్లాడి వదిలేస్తారా? అన్నది డిస్కషన్ పాయింట్ అయింది. విశాఖ సభలో పవన్ ఇచ్చే స్పీచ్ కోసం జనసైనికులే కాదు..సాధారణ జనం కూడా ఎదురుచూస్తున్నారు. ఇక పవన్ కల్యాణ్‌కు ఉన్న సినీ క్రేజ్ కూడా ఈ సభకు మరింత ప్రాధాన్యం పెంచుతోంది.
ఓజీ మూవీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్
గ్యాంగ్ స్టర్ రోల్‌లో పవర్ స్టార్ నటించిన ఓజీ మూవీ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. సరిగ్గా ఇదే టైమ్‌లో విశాఖ సభ జరగడం, ఇది రాజకీయంగా మాత్రమే కాకుండా సినీ వర్గాల్లో కూడా చర్చకు దారితీస్తుంది. అభిమానులలో ఒక వర్గం ఆయన నుంచి ఊహించని సర్‌ప్రైజ్ ఉంటుందని భావిస్తోంది. విశాఖ మహాసభ పవన్ పుట్టినరోజు వేడుకలకే పరిమితం కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే దశాబ్దానికి దిశానిర్ధేశం చేసే వేదికగా నిలిచే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.
కూటమిలోని పార్టీలన్నీ ఉత్తరాంధ్రపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఇప్పటికే పలుసార్లు విశాఖలో వరుస పర్యటనలు చేశారు. పవన్ కల్యాణ్ సభ కంటే..ఒక రోజు ముందే సీఎం చంద్రబాబు విశాఖ టూర్‌కు వెళ్లనున్నారు. జాతీయ క్రీడల దినోత్సవం ఈ నెల 29న విశాఖ వేదికగా నిర్వహించనున్నారు. దానికి ముఖ్య అతిధిగా చంద్రబాబు హాజరవుతున్నారు.
ఈ నెల 30న జనసేన ఉత్తరాంధ్ర మీట్ ఉంది. విశాఖలో నిర్వహించే ఈ భారీ సమావేశంలో పాల్గొనడానికి పవన్ కల్యాణ్ ఒకరోజు ముందే విశాఖకు వస్తున్నారు. దాంతో బాబు, పవన్ విశాఖలో ఒకే సమయంలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా చంద్రబాబు, పవన్ రాకతో విశాఖలో రాజకీయ సందడి పీక్స్‌కు చేరుతుందని అంటున్నారు.