Ganesha Idols Trunk Direction: కుడివైపా? ఎడమవైపా? ఇంట్లో పెట్టే వినాయకుడి తొండం ఎటువైపు ఉంటే మంచిది.. పండితులు ఏం చెబుతున్నారు..
ఇంట్లో పెట్టే వినాయకుడి విగ్రహంలో ఏవైపు తొండం ఉన్నది పూజించడం శుభాలు కలగజేస్తుంది? పండితులు..(Ganesha Idols Trunk Direction)

Ganesha Idols Trunk Direction: దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైపోయింది. బొజ్జ గణపయ్య పండుగను ఘనంగా జరుపుకునేందుకు అంతా సిద్ధమైపోయారు. వాడవాడల్లో మండపాలు ఏర్పాటయ్యాయి. గణనాధుల విగ్రహాలు కొలువుదీరుతున్నాయి. ఇక, ప్రతి ఇంట్లోనూ బొజ్జ గణపయ్య విగ్రహాల ఏర్పాటు మొదలైపోయింది. భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అయితే, ఇంట్లో పెట్టుకునే వినాయకుడి విగ్రహానికి సంబంధించి ఒక సందేహం అందరిలోనూ ఉంది. అదేమిటంటే.. ఇంట్లో పెట్టే గణనాధుడి విగ్రహంలో తొండం ఎటువైపు ఉండాలి? కుడి వైపు ఉండాలా, ఎడమ వైపు ఉండాలా? అసలు తొండం ఎటువైపు ఉంటే మంచిది? అనే సందేహం వ్యక్తమవుతోంది. ఇంట్లో పెట్టే వినాయకుడి విగ్రహంలో ఏవైపు తొండం ఉన్నది పూజించడం శుభాలు కలగజేస్తుంది, పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
పండితుల ప్రకారం తొండం ఎటువైపు ఉన్నా..
పండితుల ప్రకారం తొండం ఎటువైపు ఉన్నా అది భక్తులకు ఏ మాత్రం అపశకునం కాదట. గణపయ్య విగ్రహం ఏ రూపంలో ఉన్నా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే తప్పకుండా అనుగ్రహం లభిస్తుందట.
పురాణాల ప్రకారం కుడి వైపునకు తొండం ఉన్న వినాయకుడి విగ్రహం చాలా శక్తివంతమైనదని. ఇలాంటి విగ్రహాన్ని పూజించడానికి చాలా నియమ నిబంధనలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. విగ్రహం తొండం కుడివైపున ఉంటే కఠినపైన ఆరాధన నియమాలు పాటించాల్సి ఉంటుందన్నారు. ఈ రూపాన్ని పూజించాలంటే భక్తులు కఠోర దీక్షతో ఉండాలని.. సిద్ధులు, యోగులే అలాంటి ఆరాధన చేస్తారని వివరించారు. అలాంటి పూజ ఫలితంగా మోక్షప్రాప్తి లభిస్తుందని విశ్వసిస్తారు.
ఎడమ వైపు తొండమున్న గణపయ్య ఎంతో తేలికగా ప్రసన్నం అవుతారని పండితులు చెబుతున్నారు. దక్షిణాది ప్రాంతాల్లో ఎక్కువగా భక్తులు ఎడమ తొండమున్న విగ్రహాలనే ప్రతిష్ఠిస్తారని, వీటిని ఆరాధిస్తే త్వరగా కోరికలు నెరవేరతాయని నమ్ముతారు. ఇటువంటి విగ్రహాలు చాలా ప్రశాంతంగా ఉంటాయని.. శాంతి, సౌఖ్యం, సంపదను సూచిస్తాయని వివరించారు.
ఏకదంతుడి తొండం నిలువుగా ఉంటే సిద్ధి వినాయకుడు అని పిలుస్తారు. ఈ రూపంలో పూజిస్తే విజయాలు లభిస్తాయని చెబుతారు. మొత్తంగా గణపయ్య విగ్రహం తొండం ఎటు వైపు ఉన్నా ఆందోళన అవసరం లేదని, చెడు ఫలితాలు కలగవని పండితులు స్పష్టం చేశారు. భక్తి శ్రద్ధలతో గణపయ్యను ఆరాధిస్తే తప్పకుండా శుభ ఫలితాలు కలుగుతాయన్నారు.
”ఇక, ఏ ఇంట్లో కూడా మూడు గణపతుల అర్చన చేయకూడదు. ఒకే గణపతి ఉండాలి. అర్చించే ప్రధాన గణపతికి తొండం కుడి వైపు తిరిగి ఉండాలి. కుడి వైపున మోక్ష సామ్రాజ్యం ఉంటుంది. గణపతికి కుడి వైపున అఖండమైన ఆనందం ఉంటుంది. తొండం ఎడమ వైపున తిరిగి ఉంటే ఆయన ఎడమ చేతిలో మోదకం ఉంటుంది. ఎడమ తొడపై లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది. ఎడమ వైపు భోజన పదార్ధాలు, సంపద ఈ లోకానికి సంబంధించినవి.
శక్తి ఉన్న వాళ్లు, ఉపాసన ఉన్న వాళ్లు, భక్తి ఉన్న వాళ్లు తొండం కుడివైపు ఉన్నటువంటి విగ్రహాన్ని తెచ్చుకోవాలి. నియమ నిష్టలతో పెట్టుకున్న అన్ని రోజులు పూజ చేసుకోవాలి. ఒక రోజు పూజ చేసుకుంటాం అనుకునే వాళ్లు ఎడమ వైపున తిరిగి ఉండే తొండంతో ఉన్న విగ్రహాన్ని పెట్టుకోవడం ఉత్తమం” అని పండితులు తెలియజేశారు.
Also Read: వినాయక చవితి రోజున అస్సలు చేయకూడని తప్పులు, పనులు..