రాజీనామా చేసిన ఏపీ మంత్రి: రూల్ ప్రకారమే చేశా

ఆంధ్రప్రదేశ్ మంత్రి దివంగత ఎమ్మెల్యే కిడారి సర్వేస్వరరావు కుమారుడు కిడారి శ్రవణ్ కుమార్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే రాజకీయ కారణాలతో కాకుండా సాంకేతిక కారణాలతోనే కిడారి శ్రవణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు.
తన రాజీనామా లేఖను సచివాలయంలోని సీఎంఓ కార్యాలయంకు ఇవ్వగా.. అక్కడి నుంచి సీఎంఓ కార్యాలయం గవర్నర్‌కు పంపింది. 11, నవంబర్ 2018లో కేబినేట్ మంత్రిగా కిడారి శ్రవణ్ ప్రమాణస్వీకారం చేయగా.. రాజ్యాంగ నియమావళి ప్రకారం.. మంత్రిగా నియమితులైన వారు ఆరు నెలల్లోగా చట్ట సభకు ఎమ్మెల్సీగా కానీ, ఎమ్మెల్యేగా కానీ ఎన్నిక కావలసి ఉంటుంది. ఈ క్రమంలోనే కిడారి శ్రవణ్ తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది.
రాజీనామా చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రవణ్.. టీడీపీ తనను తన సొంత కుటుంబంలో వ్యక్తిలా ఆదరించిందని, మంత్రిగా 6నెలల్లో ప్రజా సేవ చేశానని అన్నారు. గిరిజన అభివృద్ధికి, అరకు నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశానని, నిబంధనల ప్రకారం రాజీనామా చెయ్యాల్సి వచ్చిందని, తనను చంద్రబాబు ఎంతగానో ప్రోత్సహించారని, చంద్రబాబుతో మాట్లాడి రాజీనామా చేసినట్లు చెప్పుకొచ్చారు. చట్టసభల్లో సభ్యుడిగా కాకపోయినా ప్రజా సేవచేసే అవకాశం వచ్చిందని శ్రవణ్ ఆనందం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో శ్రవణ్ అరకు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.