ఖమ్మం టఫ్ ఫైట్ : ఓటరు ఎటువైపు ? 

  • Published By: madhu ,Published On : April 3, 2019 / 01:44 PM IST
ఖమ్మం టఫ్ ఫైట్ : ఓటరు ఎటువైపు ? 

Updated On : April 3, 2019 / 1:44 PM IST

రాష్ట్రమంతా ఒక లెక్కైతే… ఖమ్మంలో మాత్రం ఒక్క లెక్క అన్నట్లుగా ఉంటుంది రాజకీయం. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటే అయినా.. మధ్యలో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీని ఆదరించిన ఖమ్మం ఓటర్లు… విలక్షణ తీర్పునే ఇచ్చారు. మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ఎవరి మధ్య ఉంటుంది. ఓటరు నాడి ఎటు మొగ్గుతుంది…? ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి TRS ఇప్పటి వరకూ గెలవలేదు. ఈసారి ఎలాగైనా బోణీ కొట్టాలని ఆ పార్టీ స్కెచ్ వేసింది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తైన వెంటనే గులాబీ బాస్ కేసీఆర్… ఖమ్మంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఖమ్మం సిట్టింగ్ ఎంపీ అయిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కాకుండా.. సైకిల్ దిగి కారెక్కిన నామా నాగేశ్వరరావుకు టికెట్ కేటాయించి ట్విస్ట్ ఇచ్చారు. 

ఖమ్మం లోక్‌సభ పరిధిలో.. 7 అసెంబ్లీ స్థానాలుంటే… మొన్న జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. అయితే అందులో ఇద్దరు కాంగ్రెస్, ఇండిపెండెంట్, టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడంతో.. ఇప్పుడు బలం ఐదుకు పెరిగింది. సిట్టింగ్‌కు సీటివ్వకుండా… అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రత్యర్థి అయిన నామాకు సీటివ్వడంతో కేడర్‌ కూడా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. 2014 ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేతిలో నామా ఓటమి పాలైనా ఈసారి టికెట్ ఇవ్వడంతో ఆయన అనుచరులు కూడా సైలెంటైపోయారు. గురువారం కేసీఆర్ పర్యటన ఉండటంతో.. పార్టీ నేతలను ఏకతాటిపైకి తెచ్చేందుకు నేతలు ట్రై చేస్తున్నారు. 

TRS నుండి నామా :- 
టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న నామా నాగేశ్వరరావు 2004 నుంచి 2014 వరకు టీడీపీ తరఫున లోక్‌సభకు మూడుసార్లు పోటీ చేశారు. 2009లో ఒక్కసారి విజయం సాధించారు. 2014లో నాలుగో స్థానానికి పరిమితమైన టీఆర్ఎస్… ఈసారి బాగా పలుకుబడి ఉన్న నామాను బరిలోకి దింపడం తమకు కలిసొస్తుందని భావిస్తోంది. 

కాంగ్రెస్ నుండి రేణుకా : – 
తెలంగాణ వచ్చాక స్థానిక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన సీనియర్ నేత రేణుకా చౌదరి… కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్లీ బరిలోకి దిగుతున్నారు. 1999 నుంచి 2009 వరకు పోటీ చేసిన రేణుకా చౌదరి… 2004లో నామా నాగేశ్వరరావుపై విజయం సాధించారు. మూడు సార్లు రాజ్యసభ సభ్యురాలిగా… రెండు సార్లు ఖమ్మం ఎంపీగా గెల్చిన రేణుకకు కేంద్రమంత్రిగా చేసిన అనుభవం ఉంది. అలాగే.. స్థానిక పరిచయాలు ఆమెకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. 

బీజేపీ కూడా అభ్యర్థిని బరిలో నిలిపినా… ఖమ్మంలో మాత్రం నామా వర్సెస్ రేణుక అన్నట్లుగానే పోటీ ఉంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు ప్రచారంలో దూసుకుపోతుంటే.. ఎన్నికల నాటికి పరిణామాలు ఎలా మారుతాయా అనే ఆసక్తి ఏర్పడింది. ఎప్పుడూ విలక్షణ తీర్పునిచ్చే ఖమ్మం ఓటరు.. ఈసారి ఎవరిని పార్లమెంట్‌కు పంపుతారో చూడాలి.