లిక్కర్ కార్డుల్లేవ్: అదంతా అవాస్తవ ప్రచారమే

సంపూర్ణ మద్యపాన నిషేధం లక్ష్యంగా పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ మందుబాబులకు లిక్కర్ కార్టులను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది అంటూ వచ్చిన వార్తలు అవాస్తవం అని చెప్పారు ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్(ఏపీఎప్‌బీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవ రెడ్డి. రేషన్ కోసం రేషన్ కార్డు ఎలాగో, మద్యం కోసం మద్యం కార్డు తీసుకోవాలంటూ జరుగుతున్న ప్రచారం అంతా అబద్దమే అని అన్నారు.
లాభాపేక్ష లేకుండా ప్రభుత్వ మద్యం దుఖానాల ద్వారా అమ్మకాలు జరుపుతుందని, మద్యంపై లాభాలను ప్రభుత్వం ఆశించట్లేదని అన్నారు వాసుదేవ రెడ్డి. ప్రభుత్వం రూ.5వేలతో లిక్కర్ కార్డులను ప్రవేశపెడుతుందనే ప్రచారాన్ని ఆయన ఖండించారు.
మద్యపానాన్ని పూర్తిగా నిషేధించే దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మద్యంపై ఒక్కసారే నిషేధం విధిస్తే వ్యతిరేకత వస్తుందనే భావనతో.. దశలవారీగా నిషేధాన్ని అమలు చేస్తుంది. ఈ క్రమంలోనే మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. అలానే మద్యం ధరలను భారీగా పెంచింది. పర్మిట్ రూమ్ లకు అనుమతి ఇవ్వలేదు. అదే విధంగా రెస్టారెంట్‌లలో కూడా మద్యం విక్రయాల సమయాన్ని తగ్గించారు. బార్ లైసెన్స్ ఫీజులు భారీగా పెంచేశారు.