ముద్ర ఉంటుందా..? ఎన్నికల బరిలో ముద్రగడ

తూర్పుగోదావరి : కాపు ఉద్యమ నేత మళ్లీ ప్రత్యక్ష రాజకీయాలకు సిద్ధమవుతున్నారా..వచ్చే ఎన్నికల్లో సై అంటూ బరిలోకి దిగడానికి రంగం సిద్ధమౌతోంది. సాధరణ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటున్నారా.. ఏ నియోజయవర్గం నుంచి .. ఏ పార్టీ తరపున ఆయన బరిలో దిగుతారు..? అనే దానిపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభంది ప్రత్యేక స్థానం. కాపు ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ.. రాజకీయంగా ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న నేతల్లో ఆయన ఒకరు. ఆయన తండ్రి ముద్రగడ వీరరాఘవులు.. రెండుసార్లు ప్రత్తిపాడు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పని చేశారు. ఆయన వారసుడిగా 1978లో ముద్రగడ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా కాంగ్రెస్, టీడీపీ తరుపున పలుమార్లు గెలుస్తూ వచ్చిన ముద్రగడ.. ఎన్టీఆర్ హయాంలో కీలక పాత్ర పోషించారు. మంత్రిగా కీలక శాఖలు నిర్వహించి రాజకీయంగా ఎదిగారు. ఆ తరవాత కొన్నాళ్లకే ఎన్టీఆర్‌తో విబేధించి అప్పట్లో జానారెడ్డి, కేఈ కృష్ణమూర్తి వంటి వారితో కలిసి సొంతంగా తెలుగుతల్లి పార్టీని కూడా స్థాపించారు. కానీ అది ఫలించకపోవడంతో మళ్లీ బీజేపీ పంచన చేరి .. కాకినాడ పార్లమెంట్ సీటు నుంచి విజయం సాధించారు.
తండ్రి ముద్రగడ వీరరాఘవులు
2 సార్లు ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక
1978లో ముద్రగడ రాజకీయాల్లోకి ఎంట్రీ
తొలి ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా విజయం
కాంగ్రెస్, టీడీపీ తరుపున పలుమార్లు గెలుపు
తెలుగుతల్లి పార్టీ స్థాపన
గడిచిన రెండు ఎన్నికల్లో ముద్రగడ పిఠాపురం, ప్రత్తిపాడు అసెంబ్లీ స్థానాల నుంచి వరుసగా ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ కాపు ఉద్యమంతో ఆయన నిత్యం వార్తల్లో నేతగా నిలిచారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే రాజకీయంగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్న ఆయన .. జనవరి 31న కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. కత్తిపూడి కేంద్రంగా నిర్వహించబోయే ఈ సమావేశంలో .. కీలక రాజకీయ నిర్ణయం ఖాయమని కాపు జేఏసీ నేతలు చెబుతున్నారు.
వైసీపీతో చేతులు కలిపి ఏపీ రాజకీయాల్లో సొంత సామాజిక వర్గం దన్నుతో చక్రం తిప్పాలనే ప్రయత్నానికి ముద్రగడ వచ్చినట్టు సమాచారం. అందులో భాగంగా ఆయన పిఠాపురం నుంచి మరోసారి పోటీ చేయాలని యోచిస్తునట్టు .. సన్నిహితులు చెబుతున్నారు.
పిఠాపురం నుండి పవన్ పోటీ
ముద్రగడ నేరుగా పవన్ ప్రత్యర్థితో చేతులు కలిపేందుకు సిద్ధమైతే .. సీన్ రసవత్తరంగా మారడం ఖాయం. ముఖ్యంగా పిఠాపురం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు ఇప్పటికే జనసేనాని తన మనసులో మాట బయటపెట్టుకున్నారు. అలాంటి నియోజకవర్గంలో ముద్రగడ ముందుకు వస్తే మాత్రం సీన్ మారిపోతుందనడంలో సందేహం లేదు. ఈనెలాఖరులో ముద్రగడ తీసుకోబోయే నిర్ణయం .. ఏపీ రాజకీయాల్లో పెద్ద స్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉందనడంలో సందేహం లేదంటున్నారు విశ్లేషకులు. అయితే ముద్రగడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.