గాజులు తొడుక్కోలేదు: వంశీ, కోడాలి నానికి నందమూరి చైతన్య కృష్ణ వార్నింగ్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు నందమూరి జయకృష్ణ తనయుడు, నటుడు చైతన్యకృష్ణ. రాజకీయాల్లో ఒక స్థానం కల్పించిన చంద్రబాబుపైనే వీళ్లు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు చైతన్యకృష్ణ.
రెండు సార్లు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తిపై కోడాలి నాని వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని, ఇది కరెక్ట్ కాదని మండిపడ్డారు. ఈ మేరకు చైతన్యకృష్ణ ఓ వీడియోను విడుదల చేశారు. కొడాలి నాని, వంశీ ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నారంటే దానికి కారణం మావయ్య చంద్రబాబు అని అన్నారు.
చంద్రబాబును నోటికొచ్చినట్లు దూషిస్తే సహించేదిలేదు. విధి విధానాల పరంగా ఏమైనా అభ్యంతరాలుంటే విమర్శించుకోండి.. అంతేకానీ వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం ఇక్కడ ఎవరూ గాజులు తొడుక్కొని లేరని, ఊరుకునే ప్రసక్తే లేదన్నారు చైతన్యకృష్ణ.