కొత్త ధర : ట్రాక్టర్ ఇసుక రూ.1,687
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇసుక మాఫియా నియంత్రణకు చర్యలు తీసుకుంది. తక్కువ ధరకే ఇసుక అందించేలా ప్రణాళికి

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇసుక మాఫియా నియంత్రణకు చర్యలు తీసుకుంది. తక్కువ ధరకే ఇసుక అందించేలా ప్రణాళికి
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇసుక మాఫియా నియంత్రణకు చర్యలు తీసుకుంది. తక్కువ ధరకే ఇసుక అందించేలా ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ తీసుకురానుంది. ఎంతో పారదర్శకంగా ఉండేలా చూసుకుంది. సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో కొత్త ఇసుక పాలసీ అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి బుధవారం కేబినెట్ భేటీలో ఈ పాలసీని ఆమోదించడంతో పాటు ఇసుక ధరను కూడా ఖరారు చేయనున్నారని సమాచారం. ట్రాక్టర్ ఇసుక ధర రూ.1,687.50 ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ఏపీఎండీసీ అధికారులు పంపిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేయొచ్చని వార్తలు వస్తున్నాయి. గతంలో ఉచిత ఇసుక విధానం ఉన్నప్పుడు ట్రాక్టరు ఇసుక ధర రూ.1500-1600ల మధ్య ఉండేది. దానికంటే ఐదారువందల రూపాయలు పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.
ఏపీలో 102 రీచ్ లలో ఇసుక తవ్వకాలు జరిపి, 50 నిల్వ కేంద్రాల నుంచి విక్రయాలు జరిపేందుకు ఏపీఎండీసీ సిద్ధమైంది. ఇసుక తవ్వకాలు, నిల్వ కేంద్రాలకు తరలింపు, సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ ఖర్చులు, గనులశాఖకు చెల్లించాల్సిన సీనరేజ్ ఛార్జీ అన్నీ కలిపి టన్నుకు రూ.375 వసూలు చేయాలని ఏపీఎండీసీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఇసుకను క్యూబిక్ మీటర్లలో లెక్కిస్తారు. క్యూబిక్ మీటర్ అంటే టన్నున్నరతో సమానం. ఓ ట్రాక్టర్ లో మూడు క్యూబిక్ మీటర్ల (ఒక యూనిట్) ఇసుక పడుతుంది. ఈ లెక్కన ట్రాక్టర్ లో నాలుగున్నర టన్నులకు రూ.1,687.50 అవుతుంది. అలాగే లారీల సైజును బట్టి మూడు, నాలుగు, అయిదు యూనిట్ల ఇసుక పడుతుంది. లారీల్లో ఎంత ఇసుక నింపాలనేది ఏపీఎండీసీ ఖరారు చేసింది. 6 చక్రాల లారీల్లో 11-12 టన్నులు, 10 చక్రాల లారీలో 17-20 టన్నులు, 12 చక్రాల లారీలో 23-26 టన్నులు, 14 చక్రాల లారీల్లో 29-30 టన్నులు వంతున లోడ్ చేసేందుకు గైడ్ లైన్స్ రూపొందించారు. ఈ ధరకు అదనంగా రవాణా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రతి జిల్లాలో కలెక్టర్, రవాణాశాఖ అధికారులు, లారీలు, ట్రాక్టర్ల యాజమాన్యాలతో చర్చించి ధరలు ఖరారు చేస్తున్నారు. కిలోమీటర్ కి సగటున రూ.4.90 వరకూ నిర్ణయించుకోవచ్చని ఏపీఎండీసీ జిల్లాల కలెక్టర్లకు సూచించింది. ఇసుక విక్రయాలు సెప్టెంబర్ 5 నుంచి ఆరంభం కానున్నాయి. ఇందుకోసం 50 నిల్వ కేంద్రాలు ఎంపిక చేశారు. తొలుత 20-25 కేంద్రాల్లో విక్రయాలు స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. అన్ని రీచ్ లు, నిల్వ కేంద్రాల్లో కలిపి 800 మంది సిబ్బందిని ఔట్ సోర్సింగ్ కింద తీసుకుంటున్నారు.
నూతన ఇసుక విధానంలో భాగంగా ప్రభుత్వమే ఇసుక సరఫరా చేయనుంది. సెప్టెంబర్ 5 నుంచే ఏపీ వ్యాప్తంగా ఇసుక సరఫరా ప్రారంభం కావాలి ఉన్నా.. చేయాల్సిన ఏర్పాట్లు చాలా ఉండటంతో, పాక్షికంగా ఇసుక సరఫరా ప్రారంభం కానుందని తెలుస్తోంది. వే బ్రిడ్జిలు, సీసీ కెమెరాలు ఇంకా ఏర్పాటు కాలేదు. రాష్ట్రంలో 102 రీచ్‌లు, 50 స్టాక్ పాయింట్లకు టెండర్లు ఖరారు చేశారు. ఈ స్టాక్ పాయింట్లలో ఇప్పటికే 38 పాయింట్లకు సంబంధించి టెండర్ దారులతో ఏపీఎండీసీ ఒప్పందాలు చేసుకుంది. కనీసం 20 స్టాక్ పాయింట్ల నుంచైనా తొలి రోజున ఇసుకను సరఫరా చేయాలని నిర్ణయించారు.