రాజధాని మారిస్తే మోడీని కలుస్తా : పవన్ వార్నింగ్
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. రాజధాని మారుస్తారని అనుకోవడం లేదని అన్నారు.

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. రాజధాని మారుస్తారని అనుకోవడం లేదని అన్నారు.
ఏపీ రాజధాని అమరావతిని మారుస్తారని అనుకోవడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధాని మారిస్తే ప్రధానిని కలుస్తానని చెప్పారు. శుక్రవారం (ఆగస్టు 30, 2019)వ తేదీన రాజధాని ప్రాంతంలో ఆయన పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ రోజుకో విధంగా మాట్లాడుతున్నారని తెలిపారు. రాజధాని తరలిస్తారా లేదా అనేది సీఎం జగన్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని మార్పు విషయంలో లీకులు ఇవ్వడం సరికాదని హితవు పలికారు. రాజధానిపై మంత్రుల ప్రకటనలతో గందరగోళం నెలకొందన్నారు. రాజధాని విషయంలో అవినీతి జరిగితే విచారణ జరపాలన్నారు.
28 వేల మంది రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారని తెలిపారు. 10 వేల మంది రైతుల ఆరు వేల ఎకరాలు ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మారిస్తే పెట్టుబడి పెట్టిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల సంగతేంటన్నారు. కేంద్ర నిధులిచ్చింది అమరావతికి అంతేకాని రాజధాని మారుస్తామని గందరగోళం చేయడం సరికాదన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత తీవ్రంగా నష్టం పోయామని, ఎన్నో అవమానాలు పొందామన్నారు. పార్టీలుగా విభేదించవచ్చు గానీ, ప్రజా సమస్యల పట్ల మెజారిటీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు దాని తర్వాత వచ్చే ప్రభుత్వం దాన్ని అమలు చేయాలన్నారు. ఒకవేళ రాజధాని మార్చే పరిస్థితి వస్తే జనసేన రైతుల పక్షాన ఉంటుందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేసినప్పుడు వారికి అండగా నిలబడ్డామని తెలిపారు. ఇప్పుడు కూడా రాజధాని రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
అమరావతిని తరలించబోతున్నారన్న వార్తలపై రైతులు పవన్ కళ్యాణ్ కలిశారు. రాజధాని తరలించకుండా చూడాలని వారు కోరారు. దీనిపై స్పందించిన జనసేనానీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్ట్ 30వ తేదీ శుక్రవారం రాజధాని ప్రాంతంలో పర్యటించారు. రైతులను కలిసి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు.
గత పాలకులు అవకతవకలకు పాల్పడి ఉంటే.. వాటిని సరిదిద్దుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు పవన్. రాజధాని సమస్య ఒక ప్రాంతానిది కాదు.. రాష్ట్రమంతటిది అన్నారు. రాజధాని సమస్యలపై రైతుల పోరాటానికి మద్దతుగా నిలుస్తానని పవన్ హామీనిచ్చారు.