ఆందోళనలో అన్నదాత : వర్షాలతో ఏపీలో పంటలకు అపార నష్టం

  • Published By: madhu ,Published On : October 27, 2019 / 01:05 AM IST
ఆందోళనలో అన్నదాత : వర్షాలతో ఏపీలో పంటలకు అపార నష్టం

Updated On : October 27, 2019 / 1:05 AM IST

అల్పపీడనం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు ఏపీ వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల‌ను అతలాక‌ుత‌లం చేశాయి. ఇదే క్రమంలో చేతికొచ్చిన పంట‌లు నీట మునిగాయి. ఏపుగా పెరిగిన సాగు నేల‌వాలింది. ఆరుగాళ్ల క‌ష్టం నీళ్లపాలైంది. పంట అమ్మి సొమ్ము చేసుకుందామ‌నుకున్న అన్నదాత‌కు అప్పుల‌కుప్పలే మిగిలాయి. ముఖ్యంగా వర్షాలు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాను కుదిపేశాయి. దీంతో జిల్లాలోని నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించాయి. అటు గోదావరి నది కాలువకు గండిపడడంతో వరద నీరంతా పంటపొలాలపై విరుచుకుపడింది.ఈ వరద నీటి ధాటికి వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. 

భారీ వర్షాలు, వర్షాలకు తోడు ఏలేరు కాలువకు గండి పడటంతో పంట పొలాలు అన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నాలుగు రోజులుగా పంటలన్నీ నీటిలోనే ఉండిపోవడంతో పూర్తిగా కుళ్ళిపోయాయి. ప్రధానంగా పిఠాపురం, గొల్లప్రోలు, యూ.కొత్తపల్లి, ఏలేశ్వరం, జగ్గంపేట మండలాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మరో పది రోజుల్లో చేతికి వస్తుందనుకున్న పంట నీటి పాలవడంతో రైతులు లబోదిబో మంటున్నారు. అటు కృష్ణా జిల్లాను వాన ముంచెత్తింది. అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని పులిగ‌డ్డ అక్విడ‌క్ట్‌ను తాకేలా వ‌ర‌ద‌నీరు ప్రవ‌హిస్తోంది.

కృష్ణా ప‌ర‌వాహ‌క ప్రాంతాలైన లంక‌లోనికి వ‌ర‌ద నీరు ప్రవేశించ‌డంతో పంట‌లు నీట మునిగాయి. వాణిజ్య పంట‌లైన అర‌టి, బొప్పాయి. గంధ‌, ప‌సుపు పంట‌లు పూర్తిగా దెబ్బ తినడంతో రైతులు ఆందోళ‌న చెందుతున్నారు. అకాలంగా కురిసిన వర్షాలు రైతన్నలకు నష్టాలను మిగిల్చాయి.చేతికి అందివచ్చిన పంటలు ఇలా వరదనీటిపాలు కావడంతో రైతన్నలు ఆందోళనలో మునిగిపోయారు. వర్షాల వల్ల ఎంతమేరకు పంటలు నష్టపోయాయో అంచనా వేసి నివేదిక ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. 
Read More : రూ.11 లక్షల విలువైన గంజాయి స్వాధీనం