చిన్నారికి పెద్దకష్టం : చలించిన హైకోర్టు..చికిత్స అందించాలని ఆదేశం

మాటలు కూడా సరిగ్గా రాని… ఆ చిన్నారికి తీరని కష్టమొచ్చింది. 17 నెలల వయసులోనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఆ చిట్టి తల్లిని కాపాడుకోవాలంటే జీవితాంతం మందులు వాడాల్సిందే. అసలే తల్లిదండ్రుల ఆర్థిక స్తోమత అంతంతమాత్రం. ఏం చేయాలో పాలుపోని చిన్నారి తల్లిదండ్రులు… తమ బిడ్డను కాపాడాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. చిన్నారి పేరు ఫర్నిక. వయసు 17 నెలలే. ఫర్నీక సొంతూరు జగిత్యాల. ముద్దులొలికే ఈ చిన్నారి అరుదైన గౌచర్ వ్యాధితో బాధపడుతోంది.
ఇది అత్యంత అరుదైన వ్యాధి. చికిత్స చేయించాలంటే ఏడాదికి రూ. 40 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఫర్నీక తల్లిదండ్రులకు… ఏటా అంత డబ్బు ఖర్చు పెట్టే స్థోమత లేదు. దీంతో బిడ్డ ప్రాణాల్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో… హైకోర్టు మెట్లెక్కారు. తమ చిన్నారి ఆరోగ్య పరిస్థితిని హైకోర్టుకు వివరించారు. ఫర్నీక్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ధర్మాసనం చలించిపోయింది. చిన్నారికి తక్షణమే వైద్యసాయం అందించాలని నీలోఫర్ ఆస్పత్రితో పాటు తెలంగాణ మెడికల్ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాక సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి చికిత్స అందివ్వాల్సిందిగా ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో ఫర్నీకకు చికిత్స అందించేందుకు వైద్యులు ముందుకు వచ్చారు. కోర్టు తీర్పుపై చిన్నారి ఫర్నిక తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాము అన్ని ప్రైవేటు ఆస్పత్రులకు తిరగామని.. ఖర్చు భరించే స్థోమత లేక హైకోర్టు ఆశ్రయించినట్లు తెలిపారు. తమ బిడ్డకు వైద్యం అందించేందుకు ముందుకొచ్చిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.