వాట్ ఎన్ ఐడియా : పెళ్లికి రండి..ఎన్నికల ప్రసారాన్ని చూడండి

మే 23..అందరూ ఎదురు చూసే రోజు. దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు. ప్రజలు ఎవరికి పట్టం కట్టారనేది ఆ రోజున తేలనుంది. ఈ రోజున ఎవరైనా మిస్ అవుతారా ? అందరూ టీవీల ఎదుట వాలిపోరు. అయితే మే 23నే వివాహాలు జరుగనున్నాయి. అయ్యో..బంధువులు..స్నేహితులు, ఆహ్వానించిన వారు వస్తారో రారో..అని ఓ తండ్రి ఆలోచించాడు. వెంటనే అతని బుర్రలో ఓ ఐడియా వచ్చింది. వెంటనే అమల్లో పెట్టేశాడు. తన కుమార్తె వివాహానికి రండి..ఇక్కడే ఏర్పాటు చేసిన టీవీల్లో ఎంచక్కా ఎన్నికల ప్రసారాన్ని చూడండి అంటూ శుభలేఖలో అచ్చు వేయడం అందర్నీ ఆకర్షిస్తోంది.
ఏపీ రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మే 23న పలు వివాహాలు జరుగనున్నాయి. జిల్లాలోని ఓ వస్త్ర వ్యాపారం ఉన్న యజమాని బయ్యా వాసు కుమార్తె వివాహం కూడా అదే రోజున జరుగనుంది. ఉదయం 11.50గంటలకు ముహూర్తం ఫైనల్ చేశారు. అదే రోజున ఎన్నికల ఫలితాలు ఉన్నాయి..కనుక శుభలేఖలో ‘పెళ్లికి రండి ఎన్నికల ఫలితాలను వీక్షించండి’ అంటూ ముద్రించారు. తలపాక సెట్టింగ్‌లో వధూవరుల ప్రవేశం..అప్సరసలచే ఆహ్వాన సంబరం..ఎన్నికల ఫలితాల ప్రత్యక్ష ప్రసారం అంటూ శుభలేఖలో వెల్లడించి అందరికీ పంచారు. కళ్యాణ మండపంలోనే ప్రత్యక్ష ప్రసారం ఏర్పాట్లు చేశారు.