తోటి విద్యార్ధులే చేశారా : మంటల్లో కాలిపోయిన 13ఏళ్ల బాలిక..మృత్యువుతో పోరాడి మృతి

శ్రీకాకుళం జిల్లా రాజాంలో గుర్తు తెలియని వ్యక్తులు 13 ఏళ్ల బాలికకు నిప్పు పెట్టిన ఘటనలో మంటల్లో కాలిపోయిన బాలిక భువనేశ్వరి మృత్యువుతో పోరాడి ఈరోజు మృతి చెందింది. ఈ దారుణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో జూనియర్ సివిల్ జడ్జి బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. కొంతమంది తనపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారని న్యాయమూర్తికి బాధితురాలు వాంగ్మూలం ఇచ్చింది.
తమ బిడ్డపై ఈ దారుణానికి పాల్పడింది సహచర విద్యార్ధులేనని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. తమ బిడ్డను ముగ్గురు విద్యార్ధులు వేధించేవారని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు.
వివరాల్లోకి వెళితే..రాజాంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో బాలిక ఏడో తరగతి చదువుతున్న భువనేశ్వరి మంగళవారం (జనవరి 28,2020) ఉదయం పాఠశాలకు వెళ్లింది. తిరిగి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇంటికి వచ్చింది. అనంతరం సాయంత్రం తమ నివాసానికి సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశంలోకి బహిర్భూమికి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత బాలిక కేకలు వినిపించాయి. దీంతో స్థానికులు బాలిక కేకలు వినిపిన ప్రాంతానికి వెళ్లగా..అక్కడ మంటల్లో కాలిపోతుండటం చూశారు. వెంటనే వెళ్లి మంటల్ని ఆర్పేశారు.
అప్పటికే ఆమె శరీరమంతా కాలిపోయింది. ఆ బాలిక తమ కుమార్తేనని తల్లిదండ్రులు గుర్తించారు. కన్నీరు మున్నీరవుతూ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు, బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. అదే పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు తరచూ వేధించేవారని చెప్పారు. ఈ విషయం పాఠశాల యాజమాన్యానికి తెలిసినా పట్టించుకోలేదన్నారు. సహచర విద్యార్థులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు… ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. జడ్జి బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ కేసులో సహచర విద్యార్ధులపై ఆరోపణలు వస్తున్న క్రమంలో వారిని అదుపులోకి తీసుకుని విచారించనున్నట్లుగా తెలుస్తోంది.