దసరా వేడుకలు : ఏ రాష్ట్రాల వారు ఎలా చేసుకుంటారు

  • Published By: veegamteam ,Published On : September 26, 2019 / 06:12 AM IST
దసరా వేడుకలు : ఏ రాష్ట్రాల వారు ఎలా చేసుకుంటారు

Updated On : September 26, 2019 / 6:12 AM IST

దసరా.. పండుగ మాత్రమే కాదు చెడుపై మంచి గెలిచిన రోజు. అధర్మాన్ని ధర్మం ఓడించిన రోజు. దుర్మార్గాలను దుర్గాదేవి తుదముట్టించిన రోజు దసరా. ఈ పండుగను ఆయా ప్రాంతాల వారు వారి సంప్రదాయాల ప్రకారం జరుపుకుంటారు. ఎవరు ఎలా జరుపుకున్నా అంతటా అమ్మవారిపై భక్తే అన్నింటా కనిపిస్తుంది. 

తెలంగాణలో దసరా – బతుకమ్మ..
దసరా పండుగ వచ్చిదంటే అందరి ఇళ్లలోను ఆడబిడ్డల సందడే. ఎన్ని పనులు ఉన్నా బతుకమ్మ పండగకు పుట్టింటికి వస్తారు ఆడబిడ్డలు. బతుకమ్మ అంటే.. బతుకు అమ్మా అని అర్థం. ఆడబిడ్డల పండుగే. రకరకాల పువ్వుల్ని వరసలుగా పేర్చి సాయంత్రం వీధుల్లోకొస్తారు. బతుకునివ్వు బతుకమ్మా అంటూ బతుకమ్మ చూట్టూ తిరుగుతూ పాటలు పాడతారు.

దసరా రోజు సాయంత్రం సమయాల్లో పాలపిట్టను చూస్తే శుభం కలుగుతుందని తెలంగాణ ప్రజల నమ్ముతారు. అమ్మవారి పూజ తర్వాత పాలపిట్ట దర్శనం చేసుకుంటారు. అంతేకాదు దసరా రోజున అలయ్‌-బలయ్‌ అంటారు. ఇది తెలంగాణ సంస్కృతిలో ఐక్యతగా చెప్పుకోవచ్చు.

దక్షిణాది రాష్ట్రాల్లో దసరా..
ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల వారు విజయదశమి రోజున బొమ్మల కొలువు పెట్టుకుంటారు. పేరంటాళ్లను పిలుస్తారు. పురాణాలు చదువుకుంటారు. బొమ్మల కొలువుల్లో పురాణ కథల్లో ఉండే పాత్రల బొమ్మలను అమరుస్తారు. అందులో ముఖ్యంగా మాతా గౌరీదేవీ ఉండాల్సిందే. మహిళలతో పాటు యువతులు కూడా చేరి అమ్మవారి పాటలు పాడుకుంటారు. పసుపు, కుంకుమలతో వాయనాలు ఇస్తారు.

కన్నడనాట దసరా వైభవం :
దసరాను కర్ణాటకవాసులు ప్రత్యేకంగా జరుపుకుంటారు. అమ్మవారి నవరాత్రులు ప్రారంభం అయ్యే రోజున ఘట ప్రతిష్ట చేస్తారు. కొత్త మట్టి మూకుడులో మట్టిపోస్తారు. దుర్గాదేవి ప్రతిమను ప్రతిష్టిస్తారు. ఆ మట్టిలో నవధాన్యాలను (గోధుమ, యవలు, పెసలు, శనగలు, కందులు, అలసందలు, నువ్వులు, మినుములు, ఉలవలు) చల్లుతారు. తొమ్మిది రోజులు అమ్మవారిని పూజిస్తారు. ప్రతీ రోజు ఆ మూకుడులో నీళ్లు పోస్తారు. అలా ఆ విత్తనాలు మొలకలు వస్తాయి. 10వ రోజు దర్గాదేవి పూజ చేసి ఆ ఘటాన్ని(మూకుడు) అమ్మగుడిలో పెట్టి వస్తారు.

గుజరాతీలు నృత్య కొలుపుల దసరా.. 
గుజరాతీలు దసరా నవరాత్రి ఉత్సవాలు చాలా ప్రత్యేకం. మొదటిరోజు పాటలు పాడుతూ గార్భా, దాండియా నృత్యాలతో అమ్మను కొలుస్తారు. దుర్గామాత ప్రతిమను ప్రతిష్టిస్తారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం అమ్మవారి పాటలతో పూజలు చేస్తారు. తొమ్మిది రోజులు సాయంత్రం 9 నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు గార్భా, దాండియా నృత్యాలతో అమ్మను ఆరాధిస్తారు. 10వ రోజు ప్రతీ వ్యాపారస్తుడు వారి షాపుల్లో వారి వారి వృత్తికి సంబంధించిన పనిముట్లకు, వాహనాలకు పూజ చేస్తారు. చివరి రోజు దసరా రోజు అమ్మను కొలిచి, వెళ్లిరావమ్మా అంటూ దుర్గామాత ప్రతిమలను గంగ ఒడికి చేర్చి నిమజ్జనం చేస్తారు.

మలయాళీల వాగ్దేవి ఆరాధన 
వాగ్ధేవి అంటే సరస్వతీ దేవి. దక్షిణ భారతదేశంలో కేరళ ప్రత్యేకమైనదనే చెప్పాలి. కేరళను దేవతలు నడయాడిన భూమి అంటారు. విజయదశమి రోజున కేరళవాసులు ప్రత్యేకంగా విద్య పూజ చేస్తారు. పిల్లలందరి చేత దసరా రోజు అక్షరాభ్యాసం చేయిస్తారు. సరస్వతీ పూజ చేస్తారు.

ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, హర్యానాల్లో రావణ దహనమే దసరా వేడుక
లంకేశుడైన రావణుణ్ణి శ్రీరాముడు దసరా రోజున వధించాడనీ నమ్ముతారు. అందుకే విజయదశమి రోజున ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, హర్యానా వాసులు రావణప్రతిమను దహనం చేస్తారు. దీన్నే రావణ దహనం అంటారు. ఢిల్లీలోని రామలీల మైదానంలో పెద్ద ఎత్తున ఈ  రావణ దహనం కార్యక్రమం నిర్వహిస్తారు. హైదరాబాద్ లో సెటిల్ అయిన ఉత్తరభారతీయులు ఈ ఆచారాన్ని పాటిస్తుంటారు.

బెంగాలీల దుర్గా పూజ
శరన్నవరాత్రులు అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది బెంగాలీ దుర్గాపూజ. కలకత్తా కాళీ. ఘనంగా చేసుకుంటారు. తొమ్మిది రాత్రులు కలకత్తా కాళీపూజకు దేశవ్యాప్తంగా మంచిపేరుంది. మొదటి మూడు రోజులు అమ్మవారిని పూలు, పండ్లతో పూజిస్తారు. బెంగాల్‌లో అమ్మవారికి జంతుబలి ఇస్తారు. విజయదశమి రోజున అమ్మవారి ప్రతిమను నీటిలో నిమజ్జనం చేస్తారు.

ఒరిస్సాలో దశమి పూజ 
ఒరిస్సా వాసులకు పెద్ద పండుగ అంటే దసరాయే. విజయ దశమి 10 రోజుల ముందు నుంచి అమ్మవారి పూజ ప్రారంభమవుతుంది. ఒరిస్సాలో మాత్రం దీనికి పూర్తి భిన్నం. విజయదశమి నుంచి 10 రోజులు పూజిస్తారు. అమావాస్యను కూడా పవిత్రమైన రోజు రోజుగా భావిస్తారు. దేవీ పూజలో వచ్చే అమావాస్యనాడు ప్రత్యేక ఆరాధన చేస్తారు. దసరా తర్వాత దుర్గాపూజ నుంచి 10 రోజులూ రోజుకి 10 రకాల నైవేధ్యాలతో మాతను కొలుస్తారు.

మహారాష్ట్రలో..
దసరా పండుగను నవ చండీ పూజగా జరుపుకుంటారు మహారాష్ట్ర వాసులు. ఆశ్వీయుజ మాసం ప్రారంభం అయిన మొదటి రోజునే అమ్మవారిని అత్యంత ఘనంగా ప్రతిష్టిస్తారు. సంప్రదాయంలో పూజిస్తూ పవిత్ర కలశం పెడతారు. కలశం చుట్టూ మట్టిపోస్తారు. గోధుమ, వరి, జొన్న గింజలు చల్లుతారు. అదే ఘట ప్రతిష్టాపన. తొమ్మిది రోజులు ప్రతీ రోజు పూజిస్తారు. తొమ్మిదో రోజు హోమం చేస్తారు. 10వ రోజు ఆయుధ పూజ చేస్తారు. అదేరోజు అమ్మవారి ఘటాన్ని పక్కకు జరుపుతారు. మట్టిలో మొలిచిన మొలకలతో అమ్మవారిని పూజిస్తారు. పూజ తరువాత అమ్మవారి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడంతో మరాఠా వాసుల దసరా వేడుకలను ముగిస్తారు.

ఎవరు ఎలా జరుపుకున్నా ఆ పండుగ పరమార్థం మాత్రం ఒక్కటే ఆదిశక్తి ఆరాధన. నలుగురితో కలిసి మెలగమని సందేశం ఇస్తుంది దసరా పండుగ. విజయదశమి అంతరార్థం ఇదే. ప్రతి పండుగ పరమార్థం కూడా ఇదే.