టీటీడీ షాక్ : ఆ ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం
విశ్రాంత అధికారులు, సిబ్బందికి టీటీడీ షాక్ ఇచ్చింది. పలువురిని ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయించింది.

విశ్రాంత అధికారులు, సిబ్బందికి టీటీడీ షాక్ ఇచ్చింది. పలువురిని ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయించింది.
విశ్రాంత అధికారులు, సిబ్బందికి టీటీడీ షాక్ ఇచ్చింది. పలువురిని ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయించింది. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న విశ్రాంత అధికారులు, సిబ్బందిని తక్షణమే తొలగించాలన్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ ప్రభావం సుమారు వంద మందిపై పడనుంది. జాబితా బుధవారం రాత్రికే సిద్ధం కాగా నేడు ఉత్తర్వులు రానున్నట్లు తెలుస్తోంది. 2019 మార్చి 31కి ముందు నియమితులైన ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులందరికీ ఈ నియమం వర్తించనుంది. నిత్య అన్నదానం ట్రస్టు ప్రత్యేకాధికారి వేణుగోపాల్, దేవస్థానం ఉప న్యాయవాది కారి వెంకట సుబ్బానాయుడు, ఎస్వీ రికార్డింగ్ ప్రత్యేకాధికారి మునిరత్నంరెడ్డి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సమన్వయకర్త చెంచురామయ్య సహా పలువురు తొలగింపు జాబితాలో ఉన్నారు.
టీటీడీ చర్యల నేపథ్యంలో ముని రత్నం రెడ్డి బుధవారమే రాజీనామా సమర్పించారు. శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఆయన విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. ప్రజాసంఘాల విభాగం ఓఎస్డీ వేమా వెంకటరత్నం ధర్మకర్తల మండలి పెద్దలను కలిసి విన్నవించుకున్నా ప్రయోజనం లేనట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా టీటీడీ ఆధీనంలోని కళ్యాణ మండపాలు, సమాచార కేంద్రాల్లోని సింహభాగం ఉద్యోగులు పొరుగుసేవలు, ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్నవారే. వీరిందరికీ టీటీడీ ఉద్వాసన పలకనుంది. కొన్నేళ్లుగా టీటీడీలో నియామకాలు లేకపోవడంతో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. తాజా పరిణామంతో సమస్య మరింత క్లిష్టంగా మారనుంది. విశ్రాంత డిప్యూటీ ఈవో ప్రభాకరరెడ్డితో పాటు పలువురిని టీటీడీ ఇటీవల నియమించింది. తాజా నియామకాలకు ప్రభుత్వ ఉత్తర్వులు వర్తించనందున వీరికి ఢోకా లేదని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి.