కొండపై కంత్రీలు : టీటీడీకి చిక్కిన దళారీ

తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలతో భారీస్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్న మరో దళారీ వ్యవహారం వెలుగు చూసింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి వద్ద పనిచేసే ప్రసాద్ అనే వ్యక్తి… సిఫార్సు లేఖలతో వీఐపీ బ్రేక్ టికెట్లు పొంది దాదాపు లక్ష రూపాయలకు విక్రయించినట్టు సమాచారం. ఓ ప్రజాప్రతినిధి దగ్గర పనిచేసే ప్రసాద్ మూడు సిఫార్సు లేఖలతో… శనివారం టీటీడీ చైర్మన్ కార్యాలయం నుంచి 18 టికెట్లు పొందాడు. వాటిని తమిళనాడు, బెంగళూరుకు చెందిన భక్తులకు ఒక్కో టికెట్‌ను 5,500 చొప్పున దాదాపు లక్షకు విక్రయించినట్టు తెలిసింది.
ప్రసాద్ నుంచి టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్లారు. బ్రేక్ దర్శనం సమయంలో విజిలెన్సు అధికారులు టికెట్లు ఎలా వచ్చాయంటూ భక్తుల్ని అడిగారు. ఎవరు రెకమండ్ చేశారని ప్రశ్నించారు. అప్పటికే తాము అధిక ధర చెల్లించి మోసపోయినట్లు గ్రహించిన భక్తులు..దళారీ విషయాన్ని విజిలెన్స్ వింగ్ అధికారులకు లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు అతడి నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు వైవీ సుబ్బారెడ్డి ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నప్పట్నుంచి తిరుమలలో దళారీ దందాపై టీటీడీ ఉక్కుపాదం మోపుతోంది. వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను పీఆర్వోలు బ్లాక్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు రెండ్రోజుల క్రితమే 12మంది పీఆర్వోలను అరెస్ట్ చేశారు. గత నెల రోజుల వ్యవధిలో 30 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా టీటీడీ సీరియస్ యాక్షన్ తీసుకోవడంతో కొంతమంది దళారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
తిరుమలలో దళారీ దందాను పూర్తిగా నిర్మూలిస్తామన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ప్రజాప్రతినిధుల పీఆర్వోలమని చెప్పుకుంటూ తిరుమలలో కొందరు దళారీ వ్యవస్థను నడుపుతున్నారని తెలిపారు. ఒక్కో టికెట్‌ను 14 వేల నుంచి 15 వేలకు అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే విచారణ ప్రారంభించామని కొందరు దళారులను అరెస్ట్ చేశామని వెల్లడించారు.
Read More : తిరుమల కొండపై త్వరలో వాటర్ బాటిల్స్ నిషేధం: వైవీ సుబ్బారెడ్డి