మధ్యప్రదేశ్‌లో కనువిందు చేస్తున్న ‘గోల్డెన్ ఫ్రాగ్స్’..చాలా ఏళ్లకు కనిపించాయంటున్న సైంటిస్టులు

మధ్యప్రదేశ్ లోనే ఓ ప్రాంతంలో అరుదైన పసుపు రంగు కప్పలు కనువిందుచేస్తున్నాయి. చాలా ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఈ పసుపు రంగు కప్పలు మరోసారి మనుషులకు కనిపించటంతో ఆనందం వ్యక్తం చేస్తూ..ఎంతో ఆసక్తిగా వాటిని ఫోటోలు తీస్తూ మురిసిపోతున్నారు స్థానికులు.
వర్షాకాలం వచ్చిందంటే నీటితో కాలువలు, చెరువులు..నీటి కుంటలు పొంగి పొర్లుతుంటాయి. ఈ చినుకుల చిత్తడిలో పెద్దసైజు (బావురు) కప్పలు, ఆరుద్ర పురుగుల వంటివి కనువిందు చేస్తుంటాయి. తొలకరి చినుకులతో పాటు కనువిందు చేసే అరుదైన జీవులు మనిషి మనుగడకు ప్రతీకలుగా ఉంటాయి, వాటి ఉనికితో వర్షాలు వస్తాయని నమ్ముతారు రైతన్నలు. ఇది నమ్మకం మాత్రమే కాదు అటువంటి అరుదైన జాతి జంతువులు వర్షాలు కురవటానికి సిగ్నల్స్ గా ఉంటాయి.
కాగా..వాతావరణంలో వస్తున్న మార్పులతో గత కొన్నేళ్లుగా చెరువులు, గుంటల్లో గోండ్రు కప్పలు (పెద్దసైజు) కనిపించడం లేదు. పసుపు, మిలట్రీ రంగుల్లో ఉండే ఆ కప్పలు కనువిందు చేసేవి. అవి చేసే చిత్రమైన అరుపులు అరిచినప్పుడు వాటి దవడ కింద బుడగల్లా నీలంరంగులో ఉబికేవి. వాటిని ఎంతో ఆసక్తిగా అబ్బురంగా చూసేవాళ్లం. వానాకాలం రాత్రుళ్లంతా ఆ కప్పలు సౌండ్ వినసొంపుగా అరిచేవి. ఈక్రమంలో చాలా ఏళ్లకు మధ్యప్రదేశ్‌లోని నర్సింగాపూర్ జిల్లా కేంద్రం సమీపంలోని అమ్గావ్‌లో పసుపు రంగులో మెరిసిపోతున్న కప్పలు మళ్లీ దర్శనం ఇచ్చాయి. వీటిని చూసేందుకు చిన్నారులు, పెద్దలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వీడియోలు ఫోటోలు తీస్తూ మురిసిపోతున్నారు.
సాధారణ కప్పల రంగులో కాకుండా పసుపు రంగులో కప్పలు కనిపించడంతో స్థానికులు విచిత్రంగా చూస్తున్నారు.వాటిని దూరంగా చూస్తే అచ్చంగా కోడిపిల్లల్లానే కనిపిస్తున్నాయి.అమ్గావ్ గ్రామంలో రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు రోడ్డు పక్క గుంతలు నీటితో నిండిపోయి కప్పలు రెండు డజన్లకు పైగా ఉన్న పసుపు రంగు కప్పలు నీటిలో ఈదుతూ కనిపించాయి. ఈ కప్పలు ప్రమాదకరమైనవి కావని జంతు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఈ అరుదైన జాతి కప్పల శాస్త్రీయ నామం హోప్లోబ్రోటెకస్ టైగెరినస్ అని జంతు నిపుణులు, కప్పలపై పరిశోధనలు చేస్తున్న పుణెకు చెందిన డాక్టర్ ఆనంద్ పాండే తెలిపారు. ముంబై, పుణె పరిసరాల్లో కొన్ని రోజుల క్రితం ఇటువంటి కప్పలు గుంపులు గుంపులుగా కనిపించాయని..ఇటువంటి పసుపు కప్పలు సాధారణంగా హౌరా పశ్చిమ బెంగాల్‌లో కనిపిస్తాయని డాక్టర్ ఆనంద్ పాండే తెలిపారు. అరుదుగా కనిపిస్తున్న ఈ పసుపు రంగు కప్పలపై పరిశోధనలు జరిపేందుకు జంతు శాస్త్రవేత్తలు ఎంతో ఉత్సాహం చూపుతున్నారు.