వైసీపీ ఎమ్మెల్యే కారు ధ్వంసం ఘటనలో యువకుడు అరెస్టు

  • Published By: veegamteam ,Published On : January 8, 2020 / 06:37 AM IST
వైసీపీ ఎమ్మెల్యే కారు ధ్వంసం ఘటనలో యువకుడు అరెస్టు

Updated On : January 8, 2020 / 6:37 AM IST

మాచర్చ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు ధ్వంసం ఘటనలో పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ విప్ కారుపై దాడి చేసిన ఘటనలో రాయపూడికి చెందిన సురేష్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిన్న సాయంత్రం యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 15 మందిపై కేసులు నమోదు చేశారు. దాడికి గల కారణాలు, ఎవరు ప్రోత్సహించారు అన్న కోణంలో విచారణ ప్రారంభించారు. గుంటూరు ఎస్పీ ఆధ్వర్యంలో పూర్తిస్థాయి విచారణ జరుగుతోంది. 

గుంటూరు జిల్లా చినకాకాని దగ్గర నిన్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే, విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై  రైతులు దాడి చేశారు. ఎమ్మెల్యే కారును అమరావతి రైతులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కారు నుంచి కిందకు దిగకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు ముందు బైఠాయించారు. ఈ క్రమంలో కొందరు.. రాళ్లతో కారుపై దాడి చేశారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే సెక్యూరిటీ సిబ్బందిపైనా చేయి చేసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని రైతులు నినాదాలు చేశారు. ఆందోళనకారుల నుంచి తప్పించుకునే క్రమంలో ఎమ్మెల్యే కారు మరో కారుని ఢీకొట్టింది. చివరికి.. ధ్వంసమైన కారులోనే ఎమ్మెల్యే పిన్నెల్లి వెనుదిరిగారు.

మరోవైపు రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలు, ఇటీవల జరిగిన దాడులు, శాంతిభద్రతలకు సంబంధించి డీజీపీ గౌతమ్ సవాంగ్..సీఎం జగన్ తో భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గంట సేపటి నుంచి సమావేశం కొనసాగుతోంది. రైతుల ఆందోళనలు, ఎమ్మెల్యే  రామకృష్ణ కారుపై దాడితోపాటు తదితర విషయాలపై సీఎం జగన్ కూడా సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న దాడి ఘటనతో ఇకముందు ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రత చర్యలు కట్టుదిట్ట చేయాలని సీఎం జగన్ ఆదేశాలు ఇవ్వనున్నారు.