మూఢనమ్మకం : అమ్మాయిని గుడిలో వదిలేశారు

చిత్తూరు జిల్లాలో మతిస్థిమితం కోల్పోయిన ఓ యువతిని ఎన్ని హాస్పిటళ్లలో చూపించినా జబ్బు నయం కాకపోవడంతో దేవుడిపైనే భారంవేసింది ఓ కుటుంబం. ఆ యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లకుండా.. ఆంజనేయస్వామి ఆలయానికి చేర్చింది వారి మూడనమ్మకం. అనారోగ్యంతో ఉన్న ఆ యువతి 35 రోజులుగా ఆలయంలోనే నిద్రిస్తోంది.
వివరాలు.. చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం పెద్దకురప్పల్లెకు చెందిన కృష్ణప్ప, మీనాక్షమ్మ దంపతుల కుమార్తె.. లావణ్య ఏడాదిన్నర క్రితం అనారోగ్యం పాలైంది. వెటర్నరీ డిప్లమో చదువుతున్న లావణ్య అప్పుడప్పుడూ మతిస్థిమితం లేకుండా.. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోంది. దీంతో తల్లితండ్రులకు భయంవేసి ఎన్నో ఆస్పత్రులకు తిరిగారు. బెంగళూరులోని సెయింట్ జాన్స్, వేలూరులోని సీఎంసీ ఆస్పత్రుల్లోనూ చూపించారు. కానీ ఆమె జబ్బు నయంకాలేదు. దీంతో ఏం చేయాలో తెలియని లావణ్య తల్లిదండ్రులు ఆమెకు దెయ్యం పట్టిందనే సాకుతో నాలుగు నెలలక్రితం కర్ణాటకలోని ఓ భూత వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. ఆ దెబ్బలతో దెయ్యం మాట దేవుడెరుగు కానీ… ఆమె మళ్లీ ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.
ఇలా రోజులు గడుస్తున్నా లావణ్య పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో… ఇక దేవుడే దిక్కునుకున్నారు తల్లిదండ్రులు. గుంతలపేటలోని పురాతన ఆంజనేయస్వామి ఆలయంలో 41రోజులపాటు నిద్రించి పూజలుచేస్తే ఫలితం ఉంటుందని పలువురు చెప్పడంతో… గత 35 రోజులుగా అక్కడే నిద్రిస్తున్నారు. దీనిని గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పినా తండ్రి కృష్ణప్ప మాత్రం ఒప్పుకోవడం లేదు. 41 రోజులు పూర్తయ్యాకే ఇక్కడి నుంచి వెళ్తామని చెబుతున్నారు.