సత్తెనపల్లి పొలిటిక్స్ : అంబటిపై వ్యతిరేకత !

  • Published By: madhu ,Published On : January 25, 2019 / 10:50 AM IST
సత్తెనపల్లి పొలిటిక్స్ : అంబటిపై వ్యతిరేకత !

విజయవాడ : ఈసారి ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీ మెట్లు ఎక్కాలని చూస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబుకు ఆదిలోనే చిక్కులు ఎదురవుతున్నాయి. ఆయనపై ఓ వర్గం కస్సుబుస్సులాడుతోంది. అంబటికి టికెట్ వద్దంటూ ఆ వర్గం పేర్కొంటుండడంతో సత్తెనపల్లి నియోజకవర్గంలో హాట్ టాపిక్ అవుతోంది. 
సత్తెనపల్లి నుండి అంబటి పోటీ ? 
అంబటి రాంబాబు..ప్రత్యర్థులపై తనదైన శైలిలో స్పందించే నేత. తనదైన శైలిలో రాజకీయ విమర్శలు చేయడంలో దిట్ట అయిన అంబటి ఈసారి  ఎన్నికల బరిలో నిలవాలని ఆశలు పెట్టుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన అంబటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి టికెట్ కన్ఫామ్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. 
అంబటిపై ఓ వర్గం వ్యతిరేకత : 
గత కొద్ది రోజులుగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఒక అసంతృప్తి రాజ్యం ఏలుతోంది. అంబటి రాంబాబుకు టికెట్ ఇవ్వొద్దని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు డిమాండ్ చేస్తున్నారు. అందర్నీ కలుపుకుని పోవడం లేదని…విజయవాడ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చిన బోత్సకు జనవరి 25వ తేదీ శుక్రవారం ఫిర్యాదు చేశారు. అంబటికి టికెట్ వద్దంటూ వారు తేల్చిచెబుతున్నారు. ఒకవేళ ఇస్తే..తాము ఏమాత్రం సహకరించమని బోత్స ఎదుట కుండబద్ధలు కొట్టినట్లు సమాచారం. దీనితో బోత్స వారిని సముదాయించేందుకు ప్రయత్నించారు. 
తిప్పికొడుతున్న అంబటి : 
నేతలు చేస్తున్న ఆరోపణలను అంబటి తిప్పికొడుతున్నారు. కొంతమంది కోటరిగా ఏర్పడి..తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని..అందర్నీ కలుపుకుని వెళుతూ..ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నట్లు అంబటి చెప్పుకుంటూ వస్తున్నారు. మరి సత్తెనపల్లి టికెట్ అంబటికి ఇస్తారా ? రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని బుజ్జగిస్తారా ? లేదా ? అనేది చూడాలి.