పండగ పూట UPI షాక్: గూగుల్ పే, ఫోన్ పే సర్వర్లు డౌన్

2016 నవంబరు 8అర్ధరాత్రి నోట్ల రద్దు జరిగినప్పటి నుంచి గత్యంతరం లేని పరిస్థితుల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్లు ఊపందుకున్నాయి. ఏటీఎంలోకి వెళ్లి డబ్బులు తీసుకుని నోట్లతో లావాదేవీలు జరపడాన్ని మార్చుకుని కార్డులతో పాటు డిజిటల్ వ్యాలెట్లు వాడడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పేటీఎమ్, ఫోన్ పే, గూగుల్ పేలు ప్రజలకు బాగా చేరువయ్యాయి.
ఫలితంగా చిన్నపాటి ఖర్చుల నుంచి వేలు, లక్షల్లో నగదు లావాదేవీలకు కూడా ఫోన్ పే, పేటీఎమ్, గూగుల్ పేలపై ఆధారపడ్డారు. డిజిటల్ వ్యాలెట్ల మీదే ఆధారపడి డబ్బులు చేతిలో పెట్టుకోకుండా గడిపేస్తున్నారు. వీరందరికీ ఓ పెద్ద షాక్. సోమవారం గూగుల్ పే, ఫోన్ పే పని చేయకుండా పోయాయి. వెంటనే స్పందించిన గూగుల్ పే కొద్ది గంటల్లోనే సమస్య నుంచి బయటపడింది.
కానీ, ఫోన్ పే, పేటీఎమ్‌లు పని చేయకపోవడంతో యూజర్లు తలపట్టుకు కూర్చుంటున్నారు. గూగుల్ పేతో స్కాన్ చేయడం కుదరదు కాబట్టి కచ్చితంగా స్కానింగ్ చేసే సదుపాయం ఉన్న పేటీఎమ్, ఫోన్ పేపైనే ఆశలు పెట్టుకున్నారు. ఒకవైపు ఒకటో తారీఖు కావడంతో ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవడానికి ఉంటున్న భారీ లైన్లు, మరో వైపు పనిచేయకుండా పోయిన డిజిటల్ వ్యాలెట్లు పెను భారంగా మారాయి.
సంబంధిత అధికారులు ఇప్పటికైన స్పందించి సమస్య పరిష్కారం చేయాల్సిందిగా కోరుతున్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగానే ఆటంకం కలిగిందని త్వరితగతిన పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.