అనంతలో ట్రెజరీ ఉద్యోగి ట్రంకు పెట్టెల్లో అవినీతి ఖజానా

  • Published By: madhu ,Published On : August 19, 2020 / 06:34 AM IST
అనంతలో ట్రెజరీ ఉద్యోగి ట్రంకు పెట్టెల్లో అవినీతి ఖజానా

అనంతపురం జిల్లాలో అవినీతి ఖజానా బయటపడింది. ఓ ట్రెజరర్ ఉద్యోగి కారు డ్రైవర్ బంధువు ఇంట్లో ట్రంకు పెట్టెల్లో కిలోల కొద్ది బంగారం, వెండి, పెద్ద ఎత్తున నగదు బయటపడడం సంచలనం రేకేత్తిస్తోంది. అచ్చు సినిమాను తలపించే విధంగా మారుమూల ప్రాంతంలో అవినీతి బయటపడింది.



జిల్లా ఖజానా కార్యాలయంలో మనోజ్ కుమార్ సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు. బుక్కరాయసముద్రం ఎస్సీ కాలనీకి చెందిన నాగలింగంను కారు డ్రైవర్ గ పెట్టుకున్నారు. మనోజ్ కుమార్, నాగలింగంపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి.

దీంతో వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో మంగళవారం సీసీఎస్ డీఎస్పీ ఈ. శ్రీనివాసులు, అనంతపురం డీఎస్పీ వీర రాఘవరెడ్డి, తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీంలు దాడులు చేశారు. నాగలింగంను విచారించారు. ఇచ్చిన సమాచారం ప్రకారం..అతడు మామ బాలప్ప ఇంటిని తనిఖీ చేశారు.



ఇంట్లో 8 ట్రంకు పెట్టెలు లభ్యమయ్యాయి. తెరచి చూడగా కిలోల కొద్దీ బంగారం, వెండి, భారీ మొత్తంలో నగదు వెలుగు చూశాయి. తహశీల్దార్‌ మహబూబ్‌ బాషా సమక్షంలో పంచనామా నిర్వహించారు. రెండు పెట్టెల్లోని సొత్తును లెక్కించడానికి పోలీసులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది.

మొత్తం సొత్తును లెక్కించే ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు ఖజానా కార్యాలయం సీనియర్‌ అకౌంటెంట్‌ మనోజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలవాల్సి ఉన్నాయి.