ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్వరలో వస్తా: సోనూ సూద్

  • Published By: madhu ,Published On : August 25, 2020 / 08:30 AM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్వరలో వస్తా: సోనూ సూద్

త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నట్లు ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ వెల్లడించారు. విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని మారుమూల ప్రాంతమైన కొదమ గ్రామ గిరిజనులను కలువనున్నట్లు వెల్లడించారు. గిరిజనులు చేసిన శ్రమపై సోనూ ఫిదా అయిపోయారు.



యావత్ దేశాన్ని మీ స్పూర్తి ప్రేరేపిస్తోందని కొనియాడారు. వీరి ప్రేరణ దేశం మొత్తం అనుసరించాలని, అందరం కలిసి కట్టుగా ఉంటూ..ఇలాంటి కార్యక్రమాలు చేద్దామంటూ..సోనూ పిలుపునిచ్చారు. త్వరలోనే ఏపీలో సోనూ పర్యటిస్తారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఓ జర్నలిస్టు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిన వీడియో చూసిన సోనూ ఎందుకు ఫిదా అయ్యారు ? అసలు గిరిజనులు ఏం చేశారు ? ఎందుకు ఏపీకి వస్తున్నారు ?



సాలూరు మండలంలో చింతమల, కొదమ గ్రామాలున్నాయి. ఇక్కడ 250 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కానీ వీరికి సరైన రోడ్డు, రవాణా సౌకర్యం లేదు. కొండలు, గట్టలు ఎక్కుతూ..కాలి నడకన వెళ్లాల్సిందే. ఒడిశా సరిహద్దులో 4 కిలో మీటర్ల దూరంలో ఉన్న బారి గ్రామానికి వెళ్లి నిత్యావసర సరుకులు తెచ్చుకుంటుంటారు.

అనారోగ్యం బారిన పడినా, గర్భిణీలు తీసుకెళ్లాలంటే..డోలీ కట్టి..కిలో మీటర్ల మేర నడుస్తూ..ఆసుపత్రులకు తీసుకెళుతుంటారు. ఇలా కొన్ని సంవత్సరాలు కష్టపడ్డారు. ఈ సమస్యకు చెక్ పెడుతామని అందరూ ఒక్కటయ్యారు. బారి గ్రామం వరకు రోడ్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.



ఒక్కో ఇంటికి రూ. 2 వేలు చందాలు సేకరించారు. రెండు జేసీబీలను అద్దెకు తీసుకున్నారు. వారు ఉంటున్న గ్రామం నుంచి..బారి గ్రామం వరకు ఉన్న కొండను తవ్వేశారు. పారలు, గడ్డపారలు చేత పట్టుకున్న గ్రామస్తులు రోడ్డు నిర్మాణంలో పాల్గొన్నారు. ఇలా రెండు వారాల పాటు శ్రమించారు. మరో వారం రోజుల పాటు మట్టి వేశారు.

మొత్తంగా 4 కిలోమీటర్ల మేర రోడ్ ను ఏర్పాటు చేసుకున్నారు. వీరి రోడ్డు నిర్మాణానికి సంబంధించిన వీడియోను ఓ జర్నలిస్టు ట్విట్టర్ లో పోస్టు చేశారు. దీనిని చూసిన సోనూ వారికి అభినందనలు తెలియచేశారు. మరి ఏపీకి సోనూ..ఎప్పుడు రానున్నారో త్వరలోనే తెలియనుంది.