Faf du Plessis : హైదరాబాద్ పై విజయం.. కోహ్లిపై కెప్టెన్ డుప్లెసిస్ వ్యాఖ్యలు వైరల్
ఐపీఎల్ 17వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో విజయాన్ని నమోదు చేసింది.

Faf du Plessis Blunt Virat Kohli Remark After Team Victory Against SRH
RCB Captain Faf du Plessis : ఐపీఎల్ 17వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో విజయాన్ని నమోదు చేసింది. డబుల్ హ్యాట్రిక్ ఓటముల తరువాత ఓ మ్యాచ్ గెలవడంతో ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఆనందంలో ఉన్నారు. గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో బెంగళూరు గెలుపొందింది. దీంతో ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగానే ఉంచుకుంది. ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి ఇది 250వ మ్యాచ్ కావడం విశేషం.
ఇక మ్యాచ్ అనంతరం ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడాడు. గత రెండు మ్యాచుల్లోనూ అద్భుతంగా పోరాడామని చెప్పుకొచ్చాడు. హైదరాబాద్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 270 ఫ్లస్ పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 260 పరుగులు చేశాం. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగుతోనే ఓడిపోయాం. ఈ రెండు మ్యాచుల్లో గెలుపుతీరాలకు వచ్చి ఓడిపోయినట్లు తెలిపాడు.
అయితే.. జట్టులో ఆత్మ విశ్వాసం నిండాలంటే ఖచ్చితంగా విజయం సాధించడం ఎంతో ముఖ్యమని చెప్పాడు. మాటలతో విశ్వాసం రాదని, ఫలితాలతోనే వస్తుందన్నాడు. ఈ రోజు రాత్రి అందరూ ప్రశాంతంగా నిద్రపోతారన్నాడు. తమ జట్టులో విరాట్ కోహ్లి టాప్ స్కోరర్‌గా ఉన్నాడని చెప్పుకొచ్చాడు. అయితే.. ప్రస్తుతం ఇతర ఆటగాళ్లు కూడా పరుగులు చేయడం ఆనందంగా ఉందన్నాడు.
పోటీ చాలా తీవ్రంగా ఉందని, ఇతర జట్లు చాలా బలంగా ఉన్నాయని డుప్లెసిస్ అన్నాడు. ఇలాంటి సమయాల్లో వంద శాతం ప్రదర్శన ఇవ్వకపోతే బాధపడాల్సి వస్తుందన్నాడు. ఈ సీజన్ తొలి అర్థభాగంగా కోహ్లి ఒక్కడే పరుగులు చేశాడని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మిగిలిన వాళ్లు ఆడుతున్నారని, ముఖ్యంగా కామెరూన్ గ్రీన్ ఫామ్‌లోకి రావడంతో జట్టు బలం పెరిగింది అని డుప్లెసిస్ అన్నాడు.
IPL Tickets : ఐపీఎల్ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. విరాట్ కోహ్లి (51; 43 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), రజత్ పాటిదార్ (50; 20 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) లు హాఫ్ సెంచరీలతో రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులకే పరిమితమైంది.