అయ్యో పాపం : మృతదేహాన్ని 10కిమీ మోసుకెళ్లారు

  • Published By: veegamteam ,Published On : May 5, 2019 / 11:28 AM IST
అయ్యో పాపం : మృతదేహాన్ని 10కిమీ మోసుకెళ్లారు

విశాఖ ఏజెన్సీలో దయనీయ పరిస్థితి నెలకొంది. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం స్థానికులకు శాపంగా మారింది. ఆఖరికి మృతదేహాలను భుజాలపై మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గిరిజనుడి మృతదేహాన్ని అతడి బంధువులు 10 కిలోమీటర్లు మోసుకెళ్లిన ఘటన విశాఖ ఏజెన్సీలో శుక్రవారం (మే 3,2019) జరిగింది. కొయ్యూరు మండలం గరిమండకు చెందిన మర్రి సర్వేశ్వరరావు(53) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతడిని విశాఖలోని కేజీహెచ్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం (మే 2,2019) సాయంత్రం మరణించాడు.

అతడి బంధువులు మృతదేహాన్ని నేరెళ్లబంద వరకు అంబులెన్స్ లో తీసుకెళ్లారు. అక్కడి నుంచి రోడ్డు సరిగా లేకపోవడంతో డ్రైవర్‌ అంబులెన్స్ ని నిలిపేశాడు. మృతుడి బంధువులు మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక కర్రకి చీర కట్టారు. అందులో మృతదేహాన్ని ఉంచారు. కర్రకి ముందు వైపు ఒకరు వెనుక వైపు ఒకరు నిలబడ్డారు. మృతదేహాన్ని భుజాలపైకి ఎత్తుకున్నారు. నేరెళ్లబంద నుంచి గరిమండ వరకు 10 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లారు.

రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి రహదారి సరిగ్గా ఉండి ఉంటే అంబులెన్స్ గ్రామానికి నేరుగా వచ్చి ఉండేదని చెబుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే గ్రామానికి రోడ్డు వెయ్యాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ గ్రామానికి దూరంలో ఇంకా అనేక గ్రామాలున్నాయని అక్కడా ఇలాంటి పరిస్థితి వస్తే 15 కిలోమీటర్లకు పైగా మృతదేహాలను మోయాల్సి వస్తుందని వాపోయారు.

గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయని గిరిజనులు గుర్తు చేసుకున్నారు. గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నొప్పుల సమయంలో వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లడం కష్టంగా మారిందన్నారు. వైద్య సిబ్బంది గ్రామానికి చేరుకునే లోపే గర్భిణులు ప్రసవించేస్తున్నారని తెలిపారు. వైద్య సాయం ఆలస్యం కావడంతో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ఇప్పటికైనా తాము పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రోడ్డు సౌకర్యం కల్పించి తమ ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.