పప్పు తెచ్చిన ముప్పు : పెళ్లాం పప్పు వండలేదని బావిలో దూకి వృద్ధుడు ఆత్మహత్య

  • Published By: nagamani ,Published On : July 17, 2020 / 12:53 PM IST
పప్పు తెచ్చిన ముప్పు : పెళ్లాం పప్పు వండలేదని బావిలో దూకి వృద్ధుడు ఆత్మహత్య

శ్రీకాకుళం జిల్లాలో భార్య పప్పు వండలేదని 77ఏళ్ల వృద్ధుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ షాక్ కు గురిచేసింది. ఇంతకాలం కలిసి కాపురం చేసినతరువాత కేవలం ఓ కూర కోసం ఆత్మహత్య చేసుకోవటంపై పలు అనుమానాలకు తావిచ్చింది. ఎంతో జీవితాన్ని చూసిన వ్యక్తి కేవలం పప్పు కోసం ఆత్మహత్య చేసుకోవటం వింతగా మారింది.

పలాసలోని అన్నపూర్ణ కాలనీలో నివాసం ఉండే బెల్లాల ఆంజనేయులు అనే 77 ఏళ్ల వృద్ధుడు గురువారం ఉదయం (జులై16,2020) తన భార్య నాగరత్నాన్ని పిలిచ్చి పప్పు వండమని అడిగాడు. కారణం ఏమిటో తెలీదుగానీ దానికి ఆమె పప్పు వండలేదు.దీంతో పెద్దాయన భార్యపై అంతెత్తున లేచాడు. ఎందుకు వండలేదని అడిగాడు. గొడవకు దిగాడు. మాట మాటా పెరిగింది. ఎప్పుడూ పప్పు వండనట్లుగా ఏమిటీ రంకెలు అంటూ భార్య కూడా అంది. దీంతో పెద్దాయన కోపం తారాస్థాయికి చేరుకుంది. నా మాటంటే లెక్కలేకుండా పోయిందంటూ అరుచుకుంటూ బైటకెళ్లిపోయాడు.

అలా కోపంగా వెళ్లిపోయిన ఆంజనేయులు బావిలో దూకాడు. ఈ విషయం తెలిసి స్థానికులు కాపాడే లోపే ప్రాణాలు కోల్పోయాడు. కాగా కోపంతో బైటకెళ్లిన భర్త కోపం తగ్గాక వస్తాడులే అనుకున్న భార్యకు కట్టుకున్నవాడు చనిపోయాడని తెలిసి బావురుమంది. ఇంతకాలం కాపురం చేసి..పప్పు కోసం ఆత్మహత్య చేసుకోవటం ఆమె తట్టుకోలేక కంటికి కడివెడు నీరుగా విలపిస్తోంది.

లాక్‌డౌన్, కరోనా భయంతో జనాలు ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదు. ఇంటికే పరిమితం అవుతున్నారు. దీంతో పలువురు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. పనిఒత్తిడితో మహిళలు..బైటకు తిరిగే అవకాశం లేక పురుషులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈక్రమంలో ఈ పెద్దాయన కూడా అటువంటి మానసిక సమస్యకు గురై ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం తమకోణంలో ఇంత కాలం భార్యతో కలిసి ఉండి.. వృద్ధాప్యంలో కూార కోసం ఆత్మహత్య చేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.